తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ మార్పు ఫోబియా కనిపిస్తోంది. రహస్య సమావేశాలు.. చర్చలు జోరుగా సాగుతున్నాయి. అజెండా ప్రకారం.. నేతలు మీడియా ముందుకొచ్చి.. ఒక్కో వెర్షన్ వినిపిస్తున్నారు. సోమవారం.. సీఎల్పీ ఆఫీసులో ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు రెండు గంటల పాటు రహస్య మంతనాలు జరిపారు. పీసీసీ మార్పుపై జోరుగా ప్రచార సమయంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. పీసీసీ మార్పుపై అధిష్ఠానం అభిప్రాయం కోరితే ఏం చెప్పాలనే దానిపై చర్చ జరిపినట్లు… ఆ నేతలు చెప్పుకొచ్చారు. ముగ్గురు నేతలు.., తాము పీసీసీ రేసులో ఉన్నామని బహిరంగంగానో.. అంతర్గతంగానో చెప్పుకుంటున్నావారే.
దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డిల మధ్య ప్రధానంగా పీసీసీ చీఫ్ రేస్ నడుస్తోందని.. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం అధికార ప్రతినిధిగా కొద్ది రోజుల నుంచి జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన మీడియా సమావేశాలు పెట్టి మరీ పీసీసీ చీఫ్ వ్యవహారంపై… రేవంత్ రెడ్డి ఇస్తే.. రాజకీయం వేరేగా ఉంటుందన్నట్లుగా హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా ప్రభుత్వంపై పోరాడుతున్నారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ విషయంలో ఆయన పాలకపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో.. రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ సాధించకుండా… హైకమాండ్ దృష్టిలో పడేలా.. తమ వంతు ప్రయత్నాలు చేయాలని నేతలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో … మళ్లీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనే గట్టి వాయిస్ వినిపించనున్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం టీ పీసీసీ చీఫ్‌ను మార్చాలని ఎప్పుడో అనుకుంది. కానీ నిర్ణయాన్ని మాత్రం అదే పనిగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఫలితంగా నేతల మధ్య కుమ్ములాటలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నిర్ణయం ప్రకటిస్తే.. తర్వాత అసంతృప్తి వ్యక్తమైనా అందరూ సర్దుకుంటారన్న అభిప్రాయంతో కొంత మంది నేతలు ఉన్నారు.