తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపై భిన్నాభిప్రాయాలకు తోడు భూ సేకరణకు సంబంధించి ఉద్యమాలు ఆందోళనలు నడుస్తూనే వున్నాయి.దీనికి తోడు కోర్టుల్లోనూ అనేకసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ కేసుల్లో ఎక్కువ భాగం రచనారెడ్డి అనే లాయర్ చేపట్టారు. జెఎసి ధర్నాకు అనుమతి నిరాకరణ విషయంలోనూ ఆమే వాదించారు. రచనారెడ్డి పట్ల టిఆర్ఎస్ రాజకీయ వ్యతిరేకత ఏ స్థాయిలో వుందంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో సమాధానమిస్తున్నప్పుడు ఆమె పేరు తీసి మరీ విమర్శించారు. తాజాగా సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం కోసం తీసుకున్న భూములపై ఆమె వేసేన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. వేసవి సెలవుల్లో ఇంత హడావుడిగా ఈపిటిషన్ విచారించాల్సిన అవసరమేమిటని కోర్టు ఆగ్రహించింది.పైగా 2013 చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేట్టయితే ఇక అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది. ఈ పిటిషన్ ఉద్దేశాలేమిటో తెలియడం లేదని, తను గతంలో ఇచ్చిన ఆదేశాలు కూడా ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డం కాబోవని పేర్కొంది. గతంలో అనేకసార్లు వ్యతిరేక ఉత్తర్వులు చవిచూసిన టిసర్కారుకు ఇది గొప్ప వరప్రసాదమే అయింది. ఇంకేముంది? టి న్యూస్ కుట్రల విఫలం అంటూ పెద్ద కథనమే ప్రసారం చేస్తున్నది.అందులో ఉత్తమకుమార్ రెడ్డి, రచనారెడ్డితో పాటు కోదండరాంను కూడా అడ్డుపడే కుట్ర దారుల్లో చూపడం విశేషం. అయితే ఈ ఒక్క ఆదేశంతోనే రైతుల పోరాటాలు ఆగిపోయే అవకాశం లేదు.ముఖ్యంగా కెసిఆర్ స్వంత నియోజకవర్గానికి దగ్గరలో మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆందోళన కొనసాగుతూనే వుంది.ఒక వేళ ఈ తీర్పును గొప్ప విజయంగా భావించి ప్రభుత్వం గనక మరింత దూకుడుగా వెళితే అప్పుడు ఆందోళనలు తీవ్రం కావడమే గాక కోర్టులు కూడా మరో రకంగా వ్యవహరించవచ్చు. కనుక సంయమనంతో రైతులకు న్యాయం చేసే దిశలో నడవడం అవసరం.