తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రెంట్ గురించి రోజుకో లెక్క చెబుతున్నారు తెరాస నేతలు. నూట యాభైమందిని జమచేసి పెట్టానంటారు కేసీఆర్. 16 మంది ఎంపీలతో ఏం సాధిస్తావని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారనీ, ఎన్నికల తరువాత దేశంలో ఏర్పడబోతున్నది ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వమే అని ఆయన ఢంకా బజాయిస్తున్నారు. అయితే, కేసీఆర్ మద్దతు ఇస్తున్న ఆ ఇతర పార్టీలేంటో, ఆ నాయకులు ఎవరో కూడా స్పష్టత లేదు. అదే అస్పష్టతను కొనసాగిస్తూ… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో అడుగు ముందుకేశారు. హైదరాబాద్ జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… రెండు ఎంపీ సీట్లు ఉంటేనే మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారనీ, 16 సీట్లు గెలిస్తే వాటిని 216 చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటకలో కుమారస్వామి గెలిచిన ఎమ్మెల్యే సీట్లెన్ని, ఆయన ముఖ్యమంత్రి కాలేదా అనే లాజిక్ చెప్పారు తలసాని. ఛత్తీస్ గఢ్ లో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. అవన్నీ సాధ్యమైనప్పుడు.. ఇదీ అలాగే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు అఖిలేష్ యాదవ్ గానీ, మాయావతిగానీ, స్టాలిన్, మమతా బెనర్జీ, జగన్… అందరితోనూ కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. ఈ దేశంలో మే నెలాఖరుకు కొత్త తరహా రాజకీయం వస్తుందన్నారు.
కేసీఆర్ 150 మంది ఉన్నారంటే, ఆ సంఖ్యను మరింత పెంచి 216 చేశారు తలసాని. చెప్పుకోవచ్చు తప్పులేదుగానీ… ఈ నంబర్లు వింటున్న సామాన్యులు ఎలా స్పందిస్తారనేదీ ఆలోచించాలి కదా? కేసీఆర్ కి మద్దతుగా ఉన్నారంటూ ఇతర రాష్ట్రాల నేతల పేర్లను కూడా కొన్నింటిని ప్రచారంలో వాడేస్తున్నారు. మరి, ఆ నాయకులు కూడా ఫెడరల్ ఫ్రెంట్ గురించి మాట్లాడుతున్నారా లేదా, కేసీఆర్ నాయకత్వంలో నడిచేందుకు సిద్ధమని అంటున్నారా లేదా.. అనేది కూడా ప్రజలు గమనిస్తుంటారు కదా? ఇంకోటి… రెండు ఎంపీ సీట్లు ఉన్నప్పుడు రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ కి, 16 ఎంపీ సీట్లిస్తే ఏదైనా చేస్తారని తెరాస నేతలు పదేపదే అంటుంటారు. దానికీ దీనికీ పొంతన ఎక్కడ ఉంది. తెలంగాణ ఏర్పాటు ఒక ఉద్యమం నుంచి వచ్చింది. ఇతర పార్టీలు కూడా తెలంగాణకు సానుకూలంగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఒక ప్రాంత ప్రజల ఆకాంక్ష. ఇది కేవలం కొన్ని రాజకీయ పార్టీల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్ర సాధన ఎంపీ సీట్ల ఆధారంగా జరిగింది కాదు కదా. ఏదేమైనా, ఫెడరల్ ఫ్రెంట్ గురించి వాస్తవానికి దూరంగా మాట్లాడుతున్నారు తెరాస నేతలు అనేది ప్రజలకు అర్థమౌతున్న విషయం. ఫ్రెంట్ ఏర్పాటుకు ప్రాక్టికల్ గా జరగాల్సిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదన్నది వాస్తవం.