తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడకు ఎందుకు వచ్చారు..? మళ్లీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు..? సందర్భం లేకపోయినా.. ఎందుకు చంద్రబాబు, టీడీపీపై విరుచుకుపడ్డారు..? అంటే.. వైసీపీ బీసీ గర్జన కోసం.. అన్న సమాధానం.. ఏపీ రాజకీయవర్గాల నుంచి వస్తోంది. మామూలుగా అయితే.. ఈ రోజు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. విజయవాడకు రావాల్సి ఉంది. తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్న కొత్త ఇల్లు గృహప్రవేశంలో పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ చర్చలు .. జగన్ తో జరపాల్సి ఉంది. కానీ .. జగన్మోహన్ రెడ్డి తన గృహప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది. కేసీఆర్ కు బదులుగా తలసాని.. విజయవాడలో ఎంట్రీ ఇచ్చారు. సందర్భం లేకపోయినా ప్రెస్ మీట్ పెట్టారు.
తలసాని ప్రెస్ మీట్ ఏర్పాట్లు వైసీపీ నేతలే చూశారు. అసలు తలసాని.. ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతికి రావడానికి.. వైసీపీ నేతల ఆహ్వానమే కారణమని చెబుతున్నారు. ఈ నెల పదిహేడో తేదీన.. ఏలూరులో.. బీసీ గర్జన సభను నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సభకు ఏర్పాట్లు కూడా నిర్వహిస్తున్నారు. కానీ వైసీపీలో నిఖార్సైన బీసీ నాయకుడు లేరు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలే.. బీసీ సభ ఏర్పాట్లు చూస్తున్నారు. వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా చెబుతున్న జంగా కృష్ణమూర్తిని జగన్ ఎప్పుడో… పక్కన పెట్టేశారు. ఆయన స్థానంలో గురజాలలో కాసు మహేష్ రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారు. బీసీ సభ కాబట్టి.. జంగా కృష్ణమూర్తిని పిలుస్తున్నప్పటికీ.. ఆయనకేమీ పాత్రలేదు.
అందుకే.. బీసీ గర్జనకు మద్దతు సమీకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్… తలసానిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. దశాబ్దాల పాటు టీడీపీలో ఉన్న తలసానికి.. ఆ పార్టీకి చెందిన ఏపీ నేతలతో స్నేహాలు, బంధుత్వాలు ఉపయోగించుకున్నాయి. వీటిని ఉపయోగించుకునేందుకు… టీఆర్ఎస్ ద్వారా.. తలసానిని రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది.. (కేసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా.. టీడీపీకి మద్దతుగా ఉన్న బీసీలను ఆ పార్టీకి దూరం చేసే వ్యూహంలో భాగంగా.. తలసానిని ఏపీకి పంపుతున్నారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది. ఈ క్రమంలో.. తెలంగాణకు చెందిన బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యను కూడా.. బీసీ గర్జనకు ఆహ్వానించారు. ఇప్పుడు మరో తెలంగాణ నేత.. తలసానిని వెనుకుండి ప్రొత్సహిస్తున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.