రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ఆంధ్రా రాజకీయాలే తెరాసకు ఎక్కువైపోయాయి. ఆంధ్రాలో వేలు పెడతామని, వైకాపాతో చేతులు కలుపుతున్నారు. ఇక, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే… తెరాస నాయకుడిగా కాకుండా, ఆంధ్రాలో వైకాపాకి అప్రకటిత అధికార ప్రతినిధి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా మిత్రులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ… ఆంధ్రాలో బీసీల గురించి తలసాని స్పందించారు. ఆంధ్రాలో బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు.
ఆంధ్రాకి వెళ్లి, అక్కడి బీసీలకు నాయకత్వం వహిస్తా అన్నారు. రమ్మంటూ తనను చాలామంది ఆహ్వానిస్తున్నారనీ, అక్కడి బీసీలను ఏకం చేసేందుకు కావాల్సిన ఆయుధాలు తమ దగ్గర ఉన్నాయని తలసాని చెప్పారు. చంద్రబాబు హయాంలో బీసీలకు న్యాయం జరగడం లేదనీ, ఎన్టీఆర్ ఉన్నప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఉండేదన్నారు. తెలంగాణ కేసీఆర్ కూడా బీసీలకు చాలా చేశారన్నారు. తాను గట్టిగా ప్రయత్నిస్తే ఆంధ్రాలో ఒక్కశాతం ఓటర్లనైనా ప్రభావితం చేయగలననీ, ఏపీకి తాను వస్తేనే టీడీపీ నేతలు వణికిపోతున్నారనీ, ఇక రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ వస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. జగన్ కేసీఆర్ లు కలవడం వల్ల ఆంధ్రాలో వైకాపాకి నష్టం ఏమీ ఉండదని జోస్యం చెప్పారు తలసాని.
కేసీఆర్, జగన్ లు కలిస్తే వైకాపాకి నష్టమా లాభమా అనేది వైకాపా చర్చించుకోవాల్సిన అంశం. దానిపై తలసాని విశ్లేషించడం విచిత్రంగా ఉంది. వాస్తవానికి, కేటీఆర్ తో జగన్ భేటీ అయిన దగ్గర్నుంచీ ఏపీలో జరగాల్సిన చర్చ జరుగుతోంది.ఆంధ్రా రాజకీయాల్లో తెరాస అవసరమా అనే చర్చ ఇప్పుడిప్పుడే మొదలౌతోంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కూడా ఈ తరహా ప్రచారమే చేశారు కదా! తెలంగాణలో ఆంధ్రోళ్ల ఆధిపత్యం అవసరమా, వారి చేతిల్లోకి పాలన వెళ్తిపోతుందంటూ ప్రజలను రెచ్చగొట్టారు. ఓరకంగా, గడచిన నాలుగేళ్లలో ఏపీలో తెరాసపై ఏర్పడ్డ కొంత సానుకూల అభిప్రాయాన్ని కూడా కేసీఆరే స్వయంగా గత ఎన్నికల ప్రచారంలో చెరిపేశారు. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ భావజాలాన్ని వాడుకున్నారు. ఇప్పుడు ఆంధ్రాకి వస్తాం, ఎవరో పిలుస్తున్నారు, ఆయుధాలున్నాయి, బీసీలకు నాయకత్వం వహిస్తామని తలసాని లాంటివారు ప్రకటనలు చేయడాన్ని ఏమనుకోవాలి..? ఏం, వారికేనా… ఆంధ్రా ప్రజలకు ఉండదా ఆత్మగౌరవం..? తెలంగాణ ఎన్నికల్లో నేరుగా టీడీపీ పోటీ చేసి విమర్శలు చేసింది. ఆంధ్రాలో పోటీ చేసే పరిస్థితి తెరాసకు లేకపోయినా… ఇక్కడి రాజకీయాల గురించి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం సరైందా..?