తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు! విచిత్రం ఏంటంటే, తెలంగాణలో తాను నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని పక్కనపెట్టి… ఆంధ్రా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ్ల కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్ర విమర్శలే చేశారు. తెలుగుదేశం పార్టీ రెండు నెలల్లో ఓడిపోబోతోందంటూ జోస్యం చెప్పారు. ఆంధ్రా ప్రజలను పసుపు కుంకుమ పేరుతో ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీని, ఇవాళ్ల కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టేశారన్నారు. ఓటుకు నోటు కేసుకి భయపడే ఆయన హైదరాబాద్ నుంచి పిరికిపందలా పారిపోయారన్నారు! తెలంగాణలోని సెటిలర్స్ ని తమ సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారనీ, అలాంటి తమ నాయకుడి మీద చంద్రబాబు విమర్శలు చేయడం సరైంది కాదన్నారు తలసాని.
తలసాని ఇంతకుముందు కూడా ఇదే స్థాయిలో వ్యాఖ్యల చేశారు. అయితే, ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా ఏదో జరగాలని కోరుకుంటున్నారని అర్థమౌతోంది! పదేపదే ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తూ ఉండటం ద్వారా… వారు ఆశిస్తున్నది జరగడం లేదనే ఆందోళన కూడా బయటపడుతోంది. లేదంటే… సెటిలర్ల పేరుతో ఇప్పుడు తలసాని విమర్శించాల్సిన అవసరం ఏముంది..? ఇప్పుడు ఏరకంగానూ అది చర్చనీయాంశం కాదు. ఆంధ్రా రాజకీయాలకు అన్వయమయ్యే టాపిక్ కూడా కాదు. ఇక, రెండోది… హైదరాబాద్ నుంచి విజయవాడకు చంద్రబాబు పారిపోయారని ఆరోపించడం కూడా అసందర్భమే. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిలో ఉండే అవకాశమున్నా… ఆంధ్రాకి మకాం మార్చకపోతే అభివృద్ధి జరగవనే ఉద్దేశంతో చంద్రబాబు ఏపీకి వచ్చారు.
కాంగ్రెస్ పార్టీతో స్నేహంపై కూడా విమర్శలు చేశారు తలసాని. ఆంధ్రాకి భాజపా న్యాయం చెయ్యదనేది సుస్పష్టం. హోదా ఇవ్వలేదు, విభజన చట్టంలో హామీల జోలికి వెళ్లడం లేదు, కంటి తుడుపు చర్యగా ప్రయోజనం లేని జోన్ ప్రకటించేశారు. ఎన్నికల తరువాత ఆంధ్రాకి కేంద్రంలో మద్దతుగా నిలిచేది ఎవరు..? భాజపాకి ప్రత్యామ్నాయంగా అక్కడ కాంగ్రెస్ ఉంది. ఆంధ్రాకి న్యాయం చేస్తామంటోంది. పోనీ… ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటే… తలసాని ఆరోపణలకు కొంతైనా అర్థం ఉండేది. కేవలం రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసమే జాతీయ స్థాయిలో టీడీపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందనేది ఏపీలో ప్రజలకు తెలుసు. మొత్తానికి, ఏరకంగా చూసుకున్నా.. ఎంతగా రెచ్చగొట్టేలా విమర్శలు చేస్తున్నా.. తలసాని ద్వారా కేసీఆర్ ఆశిస్తున్న రాజకీయ వేడిని ఏపీలో వారు పుట్టించలేకపోతున్నారన్నది వాస్తవం..! అందుకే, ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి పదేపదే మీడియా ముందు ప్రస్థావిస్తే హీట్ పెరుగుతుందని అనుకుంటున్నారు. అయినా, ఆంధ్రాలో ఏరకంగానూ ప్రాతినిధ్యం లేని తెరాస నాయకులు, ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెబుతూ, ఇక్కడి రాజకీయాలు ప్రభావితం చేస్తామంటే ఎవరైనా ఎలా నమ్ముతారు..?