ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికలపై ఆ రాష్ట్ర నాయకుల కంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆంధ్రాకి వచ్చి ఆయన చేస్తున్నవి ఫక్తు కుల రాజకీయాలు అనడంలో సందేహం లేదు. మార్చి 3న యాదవ గర్జన సభకు ఆయన సిద్ధమైపోతున్నారు. అయితే, ఆ సభకు పోలీసుల నుంచి అనుమతి రాలేదని అంటున్నారు. ఆంధ్రా పోలీసులకు తెలంగాణ మంత్రి క్లాస్ తీసుకున్నారు. ఆంధ్రాలో ఎప్పుడూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అనుకోవద్దనీ, అధికార పార్టీలు మారుతుంటాయని గుర్తుంచుకోవాలన్నారు. యాదవ గర్జన సభకు లేనిపోని నిబంధనలు అడ్డు చెబుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారనీ, అలాంటప్పుడు ఆంధ్రాలో తామొచ్చి సభలు పెట్టుకుంటే తప్పేంటని తలసాని అన్నారు. తమ పార్టీ ఏపీలో సభ పెట్టుకుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నేరుగా పోటీకి దిగకపోయినా, చంద్రబాబు సర్కారును ఓడించాలని పిలుపునిస్తామన్నారు. టీడీపీని ఓడించాలని ప్రజలను కోరతామనీ, ఈ క్రమంలో ఎవరికి ఓటెయ్యాలనేది తాము ప్రజలకు సూచించడం లేదన్నారు. యాదవ గర్జన సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని తలసాని చెప్పారు.
తెలంగాణలో టీడీపీ పోటీ చేసింది. ప్రజా కూటమికి ఓటెయ్యాలని ప్రచారం చేసింది. కానీ, ఆంధ్రాలో తెరాస పోటీ చెయ్యదట… ఎవరికి ఓటెయ్యాలో ప్రజలకు చెప్పదట… కానీ సభలు పెట్టి ప్రచారం చేస్తుందట! ఆంధ్రాలో వారికి ప్రాతినిధ్యం లేనప్పుడు, ఇతరులకు మద్దతు ఇవ్వనప్పుడు…. ఎన్నికల్లో ప్రచారమంటూ తెరాస చేసే రాజకీయాన్ని ఏమనాలి..? కులం పేరుతో సభలను నిర్వహిస్తూ, భావోద్వేగాలను రెచ్చగొట్టడం కోసమే ఏపీకి వస్తున్న ఇలాంటి నాయకుల తీరును ప్రజలు అర్థం చేసుకోలేరని భావిస్తున్నట్టున్నారు. చంద్రబాబును ఓడించడమే తమ లక్ష్యమని ప్రచారం చేస్తామన్నప్పుడు… ఎవరిని గెలిపించాలనేది వారి లక్ష్యమో కూడా ప్రజలకు చెప్పాలి కదా! చెప్పకపోయినా అది అర్థంకాని అంశమైతే కాదనుకోండి.