టాలీవుడ్లో ఎవరి జాతకం ఎప్పుడెలా తారుమారు అవుతుందో చెప్పలేం. మరీ ముఖ్యంగా కథానాయికల విషయంలో. ఇలా వెలుగుతారు.. అలా కనుమరుగైపోతారు. రెండేళ్ల క్రితం నుంచీ.. తమన్నా పరిస్థితి అలానే తయారైంది. చేతిలో సినిమాలు లేకపోవడం, కొత్త కథానాయికలు హవా చూపించడంతో తమన్నా ఇక సర్దుకోవాల్సిందే అనుకొన్నారు. కానీ… ఈమధ్య తమన్నా అనుహ్యంగా పుంజుకొంది. కల్యాణ్‌రామ్ సినిమాలో కథానాయికగా తమన్నాని ఎంచుకొన్నారు. లవకుశలో ఐటెమ్ గీతం అదరగొట్టేసింది. ఇప్పుడు ‘క్వీన్’ ఆఫర్ కూడా తనకే దక్కింది. సినిమాలు లేకపోయినా, అవకాశాలు తగ్గిపోతున్నా.. పారితోషికం విషయంలో రాజీ పడకపోవడం తమన్నా అలవాటు. పారితోషికంలో రిబేటు అడిగినందుకు చాలా సినిమాల్ని వదులుకొంది. తమన్నా స్పీడు తగ్గడానికి ఈ పట్టుదలే కారణం. అయితే.. ఈమధ్య మాత్రం కాస్త పట్టు సడలించిందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా లవకుశలో ఐటెమ్ సాంగ్, కల్యాణ్ రామ్ సినిమా రెండూ ఒకే ప్యాకేజీ మీద ఒప్పుకొని సంతకం చేసింది. ఓ సినిమా కోసం ఎంత పారితోషికం తీసుకొంటుందో అంతే తీసుకొని… ఐటెమ్ గీతం ఫ్రీగా చేసినట్టైంది.
‘క్వీన్’ విషయంలోనూ అంతేనట. పారితోషికం లో భారీ డిస్కౌంట్ ఇవ్వడంతోనే ఈ ఆఫర్ తమన్నాకి అందిందని తెలుస్తోంది. తెలుగు ‘క్వీన్’ కోసం చాలామంది కథానాయికల పేర్లు పరిశీలించారు. వాళ్లెవరూ పారితోషికం విషయంలో పట్టు సడలించకపోవడం, రీమేక్ కథని ఒప్పుకొనే ధైర్యం చేయకపోవడంతో.. ఈ ఆఫర్ తమన్నాకి వరించింది. మొత్తానికి తమన్నా హ్యాపీడేస్ మళ్లీ మొదలయ్యాయి. ఈ ఇన్నింగ్స్‌లో ఎలా విజృంభిస్తుందో చూడాలి.