సినిమాకి దర్శకుడే కెప్టెన్ కావొచ్చు. కానీ… నిర్మాత ఇంధనం. తను లేకపోతే… సినిమానే లేదు. కానీ అలాంటి నిర్మాతలకు విలువ ఎక్కడ? సెట్‌కి నిర్మాత వస్తే నేను రాను.. అనే హీరోలున్నారు. చెప్పిన టైమ్‌కి హీరోలు సెట్ కి రాకపోవడం, అర్థాంతరంగా షూటింగ్ క్యాన్సిల్ చేయడం వల్ల నిర్మాతలకు లక్షల నష్టం వస్తోంది. కానీ ఎవ్వరూ నోరు మెదపరు. దాంతో హీరోలూ అడ్వాంటేజ్ తీసుకొంటున్నారు. ఈ విషయంలో తమిళ నిర్మాతలు ఇప్పుడు నోరు మెదుపుతున్నారు. తాజాగా తమిళ నిర్మాతలమండలి ఈ విషయంలో కొంతమంది నటీనటులు, హీరోలపై కన్నెర్ర చేసింది. ఓ ఐదుగురు హీరోల్ని టార్గెట్ చేసి, వాళ్లపై రెడ్ కార్డ్ ఇష్యూ చేయబోతోంది. అంటే.. దాదాపుగా వాళ్లని బ్యాన్ చేసినట్టే. కాకపోతే.. ఆ ఐదుగురు ఎవరో నిర్మాతల మండలి చెప్పడం లేదు. త్వరలోనే వాళ్ల పేర్లు అధికారికంగా ప్రకటిస్తామన్నారు. అయితే ఈ లోగా ఈ ఐదుగురి సమాచారం నిర్మాతలందరికీ చెప్పి, వాళ్లని ఇక ముందు సినిమాల్లోకి తీసుకొనేముందు తమని సంప్రదించాలని తేల్చి చెప్పింది. తమ అనుమతి లేకుండా వీళ్లని తమ తమ సినిమాల్లోకి తీసుకొంటే.. వాళ్లతో వచ్చే సమస్యలకు, ఇబ్బందులకు నిర్మాతల మండలి బాధ్యత వహించదని స్పష్టం చేసింది. ఆ ఐదుగురి పేర్లు బయటకు చెప్పకపోయినా.. విశాల్, శింబు, అధర్వ, ఎస్.జె.సూర్య, యోగిబాబులే అని తమిళ ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. టైమ్ కి రాకపోవడం, నిర్మాతలకు సహకరించకపోవడం వీళ్లపై ఉన్న అభియోగాలు.
ఒకవేళ ఈ నటులపై రెడ్ కార్డ్ జారీ చేసి, వాళ్లని కంట్రోల్ చేయగలిగితే.. త్వరలో ఇదే ఫార్ములా టాలీవుడ్ నిర్మాతలకూ అనుసరించే వీలుంది. కాకపోతే.. మన స్టార్ హీరోలకు ఎదురు చెప్పే ధైర్యం నిర్మాతలకు లేదు. వాళ్లు ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ పెట్టుకొనే పరిస్థితి వచ్చింది. హీరోలపై నిర్మాతలు తమ ఆగ్రహం కురిపించకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్టులపై ఈ రెడ్ కార్డ్ బూచి చూపించి భయపెట్టే అవకాశం ఉంది.