‘తమిళ్ రాకర్స్’ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యావత్ సినిమా పరిశ్రమకి ఒక శాపంలా తయారైయింది ఈ గ్రూపు. థియేటర్లలలో విడుదలయ్యే సినిమాలను పైరసీ చేసి తొలి ఆటకే అక్రమంగా వెబ్‌సైట్‌ల్లో రిలీజ్ చేయడం ఈ గ్రూప్ దందా. వెబ్ సైట్ అనే కాదు, సోషల్ మీడియా, టెలీగ్రామ్, వాట్సప్ ఇలా అన్ని మాధ్యమాల్లో కొత్త సినిమాలని తొలిరోజే అక్రమంగా రిలీజ్ చేసి రాక్షసానందం పొందే ముఠా ఇది.
అయితే పైరసి గ్రూప్ కింగ్‌పిన్ ఎట్టకేలకు కేరళలో పోలీసులు అరెస్టు చేశారు. మదురైకి చెందిన తమిళ్ రాకర్స్ అడ్మిన్ జెఫ్ స్టీఫన్‌రాజ్ ను కేరళపోలీసులు అదుపులో తీసుకున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని థియేటర్లో ధనుష్ ‘రాయన్’ సినిమాను సెల్ఫోన్లో రికార్డు చేస్తుండగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు విచారణలో మొత్తం12 మంది టీంగా ఈ పైరసీ దందా చేస్తున్నట్లు తెలిపాడని తెలుస్తుంది. అరెస్టయిన జెఫ్ స్టీఫన్రాజ్ను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పృథ్వీరాజ్ నటించిన ‘గురువాయూర్ అంబలనడైయిల్’ సినిమా గత మే నెలలో విడుదలవగా మొదటి రోజే తమిళ్ రాకర్స్ వెబ్సైట్లో పెట్టారు. దీంతో పృథ్వీరాజ్ భార్య సుప్రియ ఫిర్యాదు మేరకు కొచ్చి సైబర్ క్రైం పోలీసులు ఈ దుండగుల ఆట కట్ట్తించాలని రంగంలో దిగారు. ఈ పైరసీ ముఠాకి చెందిన ఇతర సభ్యులని కూడా వెంటాడేపనిలో వున్నారు పోలీసులు.