యావత్ ప్రపంచం అల్లాడుతున్న వేళ…ఒకరికొకరు అండగా నిలబడాల్సిన ఆపత్కాల సమయం, సమాజం అంతా కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ ఓ భరోసానిచ్చే సంస్థ గాని వ్యక్తులు గాని మన ముందుకు వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆపదలో ఉన్న సమయంలో కడుపునిండా అన్నం పెట్టి పేద ప్రజల కి అండగా ఉండే వారు కొద్దిమందే ఉంటారు. అటువంటి వారిలో తానా సంస్థ , కార్యదర్శి రవి పొట్లూరి , కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ లాంటి వారు కొందరు.
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో వ్యాపారం చేసుకుంటూ మరోవైపు కమ్యూనిటీ సేవల్లో చురుగ్గా ఉండే రవి పొట్లూరి ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి ప్రస్తుతం కార్యదర్శిగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి వల్ల అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో జన్మభూమిపై మమకారంతో రవిపొట్లూరి చొరవ తీసుకుని మిత్రుడు బాలాజీ క్యాంటీన్ ముప్పా రాజశేఖర్ తో కలిసి కరోనాతో తీవ్రంగా నష్టపోయిన కర్నూలులో పేదలను ఆదుకునేందుకు నడుంబిగించారు. కర్నూలు నగరంలో గత రెండు నెలలుగా నిర్విరామంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. తొలుత కరోనా వైరస్ నుంచి రక్షణకోసం అందరికీ మాస్కులు, శానిటైజర్లను పంచి పెట్టారు. ఏప్రిల్ 11వ తేదీన తొలుత కర్నూలులో మాస్కులు పంపిణీ చేశారు. కర్నూలు పట్టణ కమిషనర్ రవీంద్ర బాబు చేతుల మీదుగా కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగులకు, పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేయించారు. కర్నూలు జిల్లాలో పదివేలకు పైగా మాస్కులు అందించారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలుత రెడ్‌జోన్‌లో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా రవి పొట్లూరి సహాయాన్ని అందించారు. శాంతినగర్ మునిసిపాలిటీలో ఉన్న కుటుంబాలకు నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారని మునిసిపల్ కమిషనర్ పార్థసారధి చెప్పడంతో వెంటనే స్పందించిన రవి పొట్లూరి అక్కడ ఉన్నకుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరకులను పంపిణీ చేయించారు. శాంతినగర్ మునిసిపాలిటీ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్స్ అందించారు.
కర్నూలులో శ్రీ బాలాజీ క్యాంటీన్‌తో, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్‌తో కలిసి రవి పొట్లూరి పేదలకు, వలస కార్మికులకు భోజన ప్యాకెట్లను అందించారు. దాదాపు 62 రోజులకు పైగా వివిధ చోట్ల భోజన ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది.తానా ఫౌండేషన్ అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు సహకారంతో జిల్లాలో పెద్దఎత్తున నిత్యావసర వస్తువుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మే 18వ తేదీన కర్నూలు ఓల్డ్ సిటీలో ఉన్న దాదాపు 4,000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఈ వస్తువులను పంపిణీ చేశారు. మే 21న పాణ్యం మండలంలోని సుగాలి మిట్ట, రాంభూపాల్ తండా తదితర గ్రామాల్లోని దాదాపు 2,000 కుటుంబాలకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ద్వారా నిత్యావసర సరుకులను అందజేశారు. లాక్ డౌన్ విధించిన నాటి నుంచి కర్నూలు నగరంలోని పారిశుధ్య కార్మికులకు, నిరాశ్రయులకు, హైవే మీద వెళ్తున్న వారికి స్వంత నిధులతో దాదాపు 30,000 మందికి ఇప్పటివరకు భోజనాలు అందజేశారు. శ్రీ బాలాజీ క్యాంటీన్, సాయి ఎంటర్ ప్రైజెస్, తానా, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ కలిపి కర్నూలు జిల్లాలో రెండు లక్షలకు పైగా భోజన ప్యాకెట్లు అందజేశారు. కరోనా సమయంలో ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టిన రవి పొట్లూరిని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, బోర్డు చైర్మన్ హరీష్ కోయ, మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, కోమటి జయరాం, గంగాధర్ నాదెళ్ళ అభినందించారు.
కరోనా కష్టాలు తొలగేవరకు తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని రవి పొట్లూరి తెలిపారు. అమెరికాలో కూడా తెలుగు కమ్యూనిటీకి తానా తరపున సేవలందిస్తున్నామని, అదే విధంగా కర్నూలు జిల్లాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో తానా తరపున వివిధ రకాల సేవా కార్యక్రమాలను అందిస్తున్నామని, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ద్వారా కర్నూలు జిల్లాలో 100 మంది నిరుపేద విద్యార్థులకు సహాయం అందిస్తామని రవి పొట్లూరి పేర్కొన్నారు.