కొత్త డీజీపీ పీఎస్ఆర్ ఆంజనేయులు అంటూ లీకులిచ్చిన ప్రభుత్వం … ఇప్పుడు ఆయనకు ఓ టాస్క్ ఇచ్చింది. అందులో సక్సెస్ అయితే అప్పుడు ఆలోచిస్తామన్నట్లుగా సంకేతాలిచ్చింది. ఆ టాస్క్ ఏమిటంటే సీఐడీ చీఫ్ గా పని చేయడం. మార్గదర్శిని తాము అనుకున్నట్లుగా టార్గెట్ చేయలేదనుకున్న ప్రభుత్వం.. సీనియర్ ఐపీఎస్ ను అవమానించి… సెలవులో వెళ్లిపోయేలా చేసింది. ఆయన సెలవు పెట్టగానే మరో అధికారికి ఇంచార్జ్ గా బాధ్యతలిచ్చారు కానీ.. ఆయన ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం అన్నట్లుగా ఉండాలని డిసైడ్ కావడంతో… తమ మెప్పు కోసం… ఏం చేయడానికైనా వెనుకాడని స్థితికి చేరిపోయిన ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులకే పూర్తి అదనపు బాధ్యతలిచ్చారు.
పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉంటూ.. వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లనూ హ్యాక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఆయన తీరు గురించి పోలీసు వర్గాల్లోనే కథలు కథలుగా ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీ ఆయన ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించారని చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. ఇప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఆయన పూర్తిగా పరిమితులు దాటిపోయారని.. ఆయన నిఘా పెట్టని రాజకీయ నేత లేరని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు ఆయన అన్నీ వదిలేశారన్న ఆరోపణలు … వైసీపీ నుంచే వస్తున్నాయి.
ఇప్పుడు మార్గదర్శి అంశం కోర్టులో ఉంది. ఇప్పుడేం చేయగలరన్న అంశంపై స్పష్టత లేదు. అయితే ఇప్పటిదాకా చేసిందంతా చేసి ఇప్పుడు ప్రభుత్వ పెద్దల్ని మెప్పించకపోతే..డీజీపీ పోస్టు రాదేమోనని ఆయన కంగారు పడుతున్నారు. అందుకే ఏదో ఒకటి చేస్తారని అనుకుంటున్నారు. మొత్తంగా తప్పుడు పనులు చేయడానికి అందలం ఎక్కిస్తున్న అధికారులందర్నీ శంకరగిరి మాన్యాలకు ఇప్పటికే పట్టించారని.. ప్రభుత్వం మారితే వారికి డబుల్ డోస్ ఉంటుందని..తమ పని తాము చేసుకుంటున్న అధికారులు జోకులేసుకుంటున్నారు.