రూ. వంద.. రెండు వందల పన్నుల కోసం ప్రజల ఆత్మగౌరవంపై ప్రభుత్వం దాడి చేస్తోంది. దుకాణాల ముందు చెత్తలు వేయడం.. మనుషులు ఇంట్లో ఉన్నా సీజ్ చేయడం.. ఇంట్లో వస్తువులు ఎత్తకెళ్తామని బెదిరించడం.. కుళాయిలు కట్ చేయడం వంటి వన్నీ ప్రజల్ని మానసికంగా వేధించడానికి చేస్తున్నారు. బాధ్యతాయుత ప్రభుత్వం ఎలా చేయడం సమంజసమేనా ? ప్రజాస్వామ్యంలో ప్రజలే తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని తెలిసి కూడా వారి ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం దెబ్బకొడుతూంటే ఏమనుకోవాలి ? ఇంత బరి తెగిపు దేని కోసం ?
ఇలా పన్నులు వసూలు చేసిన చరిత్ర ఉందా !?
ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, చెత్త పన్నులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. పన్నులు కట్టకోపతే ఇంట్లోని వస్తువులను జప్తు చేస్తామనే హెచ్చరికలతో వాహనాలను తిప్పుతున్నారు. కొన్ని చోట్ల మంచి నీటి కనెక్షన్లను కట్ చేస్తున్నారు. వలంటీర్ల సాయంతో ఇళ్ల పన్నుల వసూళ్లలో అధికారుల వ్యవహరిస్తున్న తీరుపై బాధితులు మనోవేదన చెందుతున్నారు. సమాజంలో పరువు పోతోందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఎందుకిలా చేస్తుందో .. తమను ఎందుకు టార్గెట్ చేస్తుందో జనం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలా వాళ్లు.. రేపు మేము అనే భావనకు వారు వస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వానికేనా ? ప్రజలకు ఉండవా ?
కరోనా దెబ్బ ప్రభుత్వలపై ఎంత పడిందో సామాన్యులపై అంతే పడింది . వాళ్లు అప్పుల పాలయ్యారు. ఇంకా ప్రభుత్వానికి అప్పులు లెక్కకు మించి చేసుకోవడానికి ప్రజల్ని తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సామాన్య ప్రజలకు అది కూడా లేదు. పైగా ప్రభుత్వ విధానాలతో ఏపీ ప్రజల ఆర్థిక పునాదులు కదిలిపోయాయి. చేసుకుందామంటే కూలి పనులు దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పన్నుల పేరుతో ప్రజలపై పడటం … కట్టకపోతే వారి పరువు తీయడం అనైతికమే అవుతుంది. ప్రజల ఆర్థిక ఇబ్బందులను గుర్తించి.. ఇలాంటి పన్నులను ప్రభుత్వాలుచాలా వరకూ తగ్గిస్తున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా పన్నులు వసూలు చేసిన చరిత్ర లేదు. కానీ ఏపీలో మాత్రమే ప్రజల్ని డబ్బుల కోసం ప్రభుత్వం పీడిస్తోంది.
దిగువ మధ్యతరగతి వారినే పీల్చి పిప్పి చేస్తున్నారు !
కట్టగలిగే వారు.. పన్నులను రెగ్యులర్గా కడుతూనే ఉంటారు. కట్టని వారు దిగువ మధ్యతరగతి వారే. ఓ మాదిరి భవనాలున్న వారు … అన్నీ సక్రమంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ భవనాల మీద వచ్చే ఆదాయంతో అయినా పన్నులు కట్టేస్తారు. పన్నులు కట్టని వారు ఉంటే… దిగువ మధ్యతరగతి వారే. వారికి రోజువారీ ఆదాయం.. జీవనానికే సరిపోదు. అందుకే గత ప్రభుత్వాలు పన్నులు కట్టమని ఎక్కడా వత్తిడి చేసేవి కావు. అలా పెండింగ్ పడిపోయిన తర్వాత మాఫీ చేయడమో… భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించడమో చేస్తాయి. కానీ ఈ సారి మాత్రం నిరుపదేల్ని కూడా ప్రభుత్వం పీల్చి పిప్పి చేస్తోంది.
ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. ప్రజల ఆత్మగౌరవంపై దాడి చేస్తే వారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. లేకపోతే.. వారు కొట్టే దెబ్బతో అధికారం పోయిన తర్వాత ఊహించుకుని ప్రయోజనం ఏమీ ఉండదు.