ఎన్నికల్లో ఓట్లు తెచ్చి పెట్టేవి జనాకర్షణ హామీలే. టీడీపీ వీటిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ .. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఓ మేనిఫెస్టో కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా.. మేనిఫెస్టోను సిద్ధం చేసింది. చంద్రబాబు తుదిమెరుగులు దిద్దారు కూడా. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే .. తమ హామీలను కొన్నింటిపై మీడియాకు సమాచారం ఇచ్చింది. గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు… రాబోయే ఐదేళ్లకు తీసుకునే ప్రణాళికలను మేనిఫెస్టో లో పొందుపరిచినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
రైతులకు పగటిపూట 12గంటల ఉచిత విద్యుత్, అన్నదాత సుఖీభవ పథకం వచ్చే ఐదేళ్లు పొడిగింపు , 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, 2019కల్లా పోలవరం పూర్తి చేసి 40లక్షల ఎకరాలకు నీరు, వృధ్యాప్య పెన్షన్ వయసు 65 నుంచి 55 సంవత్సరాలకు తగ్గించడం, మహిళలకు పసుపు-కుంకుమ పథకం ప్రతి ఏటా కొనసాగింపు, చంద్రన్న బీమా రూ. 5 లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచడం, ప్రతికుటుంబానికి నెలకు రూ. 15వేలు వచ్చేలా చర్యలు, రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి అన్న క్యాంటీన్లు ఏర్పాటు, అన్ని వర్గాల ప్రజలకు చంద్రన్న పెళ్లికానుక ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టనున్నారు.
వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలు మాత్రం బయటకు రావడం లేదు. అయితే నవరత్నాల్లోని కొన్ని అంశాలను.. చంద్రబాబు ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించారు. దాంతో.. వాటిల్లో పెంపును చూపిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి..తాను ఎన్నో హామీలు ఇవ్వనని.. రెండు అంటే..రెండు పేజీల్లోనే మేనిఫెస్టోను ప్రకటిస్తానని పదే పదే చెప్పారు. అందుకే.. పరిమితంగానే… మేనిఫెస్టోల్లో హామీలు ఉండే అవకాశం ఉంది…!