ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సన్నాహాలు ముమ్మరం చేసుకుంటున్నారు. పాదయాత్ర అంటే ఆయన ఒక్కరే నడిస్తే సరిపోదు కదా.. ఆయనతోపాటు కొంతమంది కార్యకర్తలూ నాయకులు కూడా బయలుదేరేందుకు సిద్ధమౌతున్నారు. జగన్ యాత్ర ఏ జిల్లాలోకి ప్రవేశిస్తే ఆ జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా వైకాపా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే… అధికార పార్టీ తెలుగుదేశం కూడా జగన్ పాదయాత్రకు ధీటుగా ప్రణాళికలు రచిస్తోందని సమాచారం! జిల్లాలవారీ ప్రణాళికతో వ్యూహాత్మకంగా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాల వారీ అంటే.. జగన్ యాత్ర ఏ జిల్లాలోకి ప్రవేశిస్తే, అదే జిల్లాలో టీడీపీ వ్యూహం అమల్లో ఉంటుందట! ఇంతకీ ఆ వ్యూహం ఏంటంటే… ఆపరేషన్ ఆకర్ష్!
నంద్యాల ఉప ఎన్నిక విజయం దగ్గర్నుంచీ వైకాపా నేతలు వలసలపై అడపాదడపా టీడీపీ నేతలు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది వైకాపా నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనీ, త్వరలోనే జంపింగులు మళ్లీ మొదలౌతాయనే సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే వైకాపా ఎంపీ బుట్టా రేణుకతోపాటు కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు తెరమీది రావడం, జగన్ కూడా మీటింగ్ పెట్టి వారి నుంచి వివరణ కోరడం, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నది మనమే అని బుజ్జగించే ప్రయత్నం చేయడం.. అన్నీ జరిగాయి. అయితే, జగన్ పాదయాత్ర మొదలు కాగానే వైకాపా నుంచి వలసలు ఉండేలా టీడీపీ ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. జగన్ యాత్ర కర్నూలు జిల్లాలో ప్రవేశించగానే వైకాపా ఎంపీ బుట్టా రేణుకను పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నట్టు ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది! అంతేకాదు, జగన్ యాత్ర అనంతపురం వెళ్లగానే అక్కడి వైకాపా నుంచి కూడా ఓ ప్రముఖ నేతను చేర్చుకునే షెడ్యూల్ దాదాపు ఖరారైందనే తెలుస్తోంది! వీలైనన్ని జిల్లాలో ఇదే తరహాలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు టీడీపీ వ్యూహ రచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
నిజానికి, ఇప్పటికే జగన్పై టీడీపీ నేతల విమర్శలు బాగా పెరిగాయి. జగన్ పాదయాత్ర దగ్గరౌతున్న కొద్దీ ఆయనపై ఉన్న కేసుల గురించి మంత్రి యనమల మాట్లాడితే, అన్న వస్తున్నాడు అంటుంటే జనం భయపడుతున్నారనీ, అవినీతి అనకొండ వస్తోందని ఆందోళన చెందుతున్నారంటూ మంత్రి దేవినేని ఉమ వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. జగన్ పాదయాత్ర మొదలు కాబోతున్న నేపథ్యంలో టీడీపీ ఎదురుదాడి పెరిగింది. దీంతోపాటు వలసలని కూడా ఈ తరుణంలో వాడుకుంటే, సరైన ఎత్తుగడ అవుతుందనేది ఆ పార్టీ నేతల వ్యూహంగా అనిపిస్తోంది. ఇంతకీ.. జగన్ పాదయాత్రపై ఎందుకింత ఉలికిపాటు అవసరమా అంటే… ఏపీ రాజకీయాల్లో పాదయాత్రలకు చాలా చరిత్రే ఉంది కదా! గతంలో దివంగత వైయస్సార్ పాదయాత్రతోనే ఏపీ రాజకీయాలను మలుపుతిప్పారు. గడిచిన ఎన్నికల ముందు చంద్రబాబు కూడా ఇదే బాట పట్టారు. ఇప్పుడు జగన్ బయలుదేరబోతున్నారు! కాబట్టి, ఆ ప్రభావాన్ని వీలైనంత తగ్గించడమే టీడీపీ ముందున్న లక్ష్యం అనుకోవచ్చు. దాన్లో భాగంగా వలసలు ఉండేందుకే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది.