ఏపిలో వైకాపా మొదలుపెట్టిన ‘గడప గడపకి వైకాపా’ కార్యక్రమాన్ని చూసి అధికార తెదేపా అప్రమత్తం అయ్యి జగన్ లక్ష్యంగా ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది. తెదేపా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేందుకు వైకాపా వద్ద వంద కారణాలున్నాయి కానీ వైకాపాని వేలెత్తి చూపేందుకు తెదేపా వద్ద ఒకే ఒక్క కారణం ఉంది. అది కూడా రాష్ట్రాభివృద్ధితో సంబంధం లేని విషయం. అదే జగన్ అక్రమాస్తుల కేసులు.. సిబిఐ ఛార్జ్ షీట్లు. తెదేపా నేతలు అందరూ అదే పాయింటు మీద మాట్లాడవలసిరావడంతో వారి వాదనలు, విమర్శలు చాలా పేలవంగా కనిపిస్తున్నాయి.
తెదేపా ఎమ్మెల్యేలు జగన్ అక్రమాస్తుల కేసుల గురించి శాసనసభలో మాట్లాడి కట్టడి చేయగలుగుతున్నారు. కానీ శాసనసభ బయట విశాలమైన రాష్ట్రంలో వైకాపాని కట్టడి చేసేందుకు ఆ టెక్నిక్ పనిచేయడం లేదు. తెదేపా నేతలందరూ మూకుమ్మడిగా జగన్ అక్రమాస్తుల కేసుల గురించే మాట్లాడుతున్నా వారు ఆశించిన ఫలితం కనిపించడం లేదు. వైకాపా నేతలు ఒకేసారి 13 జిల్లాలలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం గురించి చెడ్డగా ప్రచార చేస్తుంటే వారిని ఏవిధంగా అడ్డుకోవాలో తెలియక తెదేపా నేతలు సతమతమవుతున్నారు.
జగన్ తరచూ చేసే రెండు మూడు రోజు దీక్షలు, ధర్నాల మాదిరిగా కాకుండా ఈ గడప గడపకి వైకాపా కార్యక్రమం నెలల తరబడి కొనసాగబోవడం వారిని ఇంకా చింతింపజేస్తోంది. వైకాపాని ఏవిధంగా ఎదుర్కొని నియంత్రించాలో…దాని వలన తెదేపాకి, ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని ఏవిధంగా నివారించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. దీని కోసం తెదేపా నేతలు ఏదో ఒక గొప్ప అద్భుతమైన వ్యూహం అమలుచేయవలసి ఉంటుంది. ఇప్పటికే 20 మంది వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలోకి ఫిరాయింపజేశారు కనుక వైకాపాని నిలువరించేందుకు, మళ్ళీ ఫిరాయింపులకి గట్టిగా ప్రయత్నిస్తారేమో?
వైకాపా వ్యూహానికి తెదేపా ఎటువంటి ప్రతి వ్యూహం అమలు చేస్తుందో మరికొన్ని రోజులలోనే తెలియవచ్చు. అప్పుడు కూడా తెదేపా నేతలు జగన్ అక్రమాస్తుల కేసుల గురించే మాట్లాడితే వారి వద్ద జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు బలమైన వ్యూహం ఏదీ లేదని స్పష్టం అవుతుంది.