ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీంకు ఫేక్ పోస్టుల టీం అనే ఓ ముద్ర ఉండటంతో సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫేక్ పోస్టులన్నింటికీ టీడీపీ పీకే టీంకు అంట గట్టేస్తోంది. వైసీపీ కోసం ఇంకా పీకే టీం పని ప్రారంభించిందో లేదో ఎవరికీ తెలియదు కానీ..ఆ పార్టీ నేతలు మాత్రం ఫేక్ పోస్టులు ఎక్కడ కనిపించినా పీకే టీం వచ్చేసింది జాగ్రత్త పడండి అంటూ నెటిజన్లను అలర్ట్ చేస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనని మాటలను అన్నట్లుగా సృష్టించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో కనిపించింది. దాన్ని తీసుకుని టీడీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లోనే ప్రశాంత్ కిషోర్ టీంపై ఆరోపణలు చేసింది.
పీకే టీం పని ప్రారంభించిందని విద్వేషాలను పెంచడానికి రెడీ అయిందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు పంపింది. ఇదే మొదటిసారి కాదు.. కొంత కాలంగా కులాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులన్నింటికీ పీకే టీమే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. ఓ కులాన్ని గుర్తు చేసేలా పేరుకు ట్యాగ్లు తగిలించుకుని వేరే కులాల్ని తిట్టడం లాంటివి చేస్తున్నారు. అలాగే … ఓ స్ట్రాటజీ ప్రకారం టీడీపీ గెలిస్తే లోకేష్ సీఎం అవుతాడనే ప్రచారాన్ని చేస్తున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వీటన్నింటికీ ఎప్పుటికప్పుడు విరుగుడు ఇవ్వడానికి టీడీపీ సోషల్ మీడియా ప్రయత్నిస్తోంది.
అయితే ఈ ఫేక్ పోస్టులు పెట్టాలంటే ప్రశాంత్ కిషోరే రావాలా.. వైసీపీ నేతలు కూడా పెట్టుకోగలరు కదా అన్న డౌట్ అందరికీ వస్తుంది. అయితే గత ఎన్నికల్లో కులాల ప్రకారం తప్పుడు ప్రచారం చేయడంలో పీకే టీం సక్సెస్ అయిందని… ఇప్పుడు మాత్రం తక్కువగా ఆయనను తీసుకోకూడదని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. అందుకే చాలా బలంగా పీకే అంటే ఫేక్.. ఫేక్ అంటే పీకే అని ప్రచారం చేసేందుకు ఏ మాత్రం ముందూ వెనుకా చూడటం లేదు.