ప్రత్యేకహోదా విషయంలో జగన్ కమిట్ మెంట్ నచ్చి ఆ పార్టీలో చేరానని ప్రకటించారు.. ఎంపీ అవంతి శ్రీనివాస్. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడు మనం కూడా చేద్దామని ఆయన చంద్రబాబుకు చెబితే వదన్నారట. రాజీనామా చేయకుండా సాధించింది ఎం ఉంది అని ఆయన ప్రశ్నించారు.. రాష్టాన్ని విభజించిన కాంగ్రెస్ తో కలిశారని.. చంద్రబాబు అవకాశవాది అని అవంతి తేల్చేశారు. రైల్వే జోన్ కోసం నేను ధర్నా చేస్తే తనను మందలించారు గుర్తు చేసుకున్నారు. తాను ఎం చెబితే ప్రజలు అదే నమ్ముతారని చంద్రబాబు భావిస్తున్నారని.. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా ఓ ఎమ్మెల్యే వల్లే రాలేదనే గుట్టు విప్పారు. ఓ ఎమ్మెల్యే అవినీతి గురించి పీఎంఓ కి సమాచారం అందిందని.. ఆ అవినీతిపై ప్రధాని సీరియస్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఆ విషయంలో బాబు, మోదీ మధ్య విబేధాలొచ్చాయని ప్రకటించారు.
తునిలో రైలు తగులబెట్టిన ఘటనలో.. కడప నుంచి మనుషులను తెచ్చారని చంద్రబాబు అన్నారని… కాపులకు రైలు తగులబెట్టే సత్తా కూడా లేదా? అని అవంతి శ్రీనివాస్ ఆవేశ పడ్డారు. కాపులకు జగన్ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు తో తాను ఏ పని అయినా చేయించుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని చాలెంజ్ చేశారు. భీమిలి టిక్కెట్ విషయంలో టీడీపీ అధినాయకత్వం నుంచి హామీ లభించకపోవడంతో.. ఆయన వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
చంద్రబాబు ఢిల్లీ దీక్షలో కూడా పాల్గొని.. ఇప్పటి వరకూ.. వైసీపీ నేతలపై చేసిన ఆరోపణలను.. ఆ పార్టీలో చేరగానే.. చంద్రబాబుపై మళ్లించారు అవంతి శ్రీనివాసరావు. ఒక్క రోజులోనే.. మొత్తానికి స్టాండ్ మార్చి… జగన్ కు బదులుగా చంద్రబాబును తిట్టడం ప్రారంభించారు. రేపు జగన్ తాను అనుకున్న భీమిలి టిక్కెట్ ఇవ్వకపోతే… మళ్లీ .. జగన్ ను ఇలాగే తిడతారేమో..? గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన.. అనేక మంది.. ఎన్నికల తర్వాత అలానే జగన్ తిట్టేసి బయటకు వచ్చారు. రాజకీయం అంటే ఇంతేనేమో.. ?