ఆలయాలపై దాడుల వ్యవహారంలో పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే ఇరవై నాలుగ్గంటల్లో పట్టుకుంటారన్న అభిప్రాయం కింది నుంచి పై దాకా వినిపిస్తున్న సమయంలో.. నిందితులెవరన్నదానిపై చర్చ అంతకంతకూ పెరుగుతోంది. అమ్మఒడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాత్రి గుళ్లను ధ్వంసం చేసి.. ఉదయం ఆలయాలు చూడటానికి వెళ్తున్నారని.. రథాలను తగులబెట్టి రథయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్నే హైలెట్ చేస్తోంది. ముఖ్యమంత్రి వద్ద ఆలయాలపై దాడులకు సంబంధించి పూర్తి సమాచారం ఉందని ఆయన మాటల ద్వారా తెలుస్తోందని.. తక్షణం ఆయనకు నోటీసులు జారీ చేసి.. వివరాలు తెలుసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరుక డీజీపీకి లేఖ రాశారు టీడీపీ నేత వర్ల రామయ్య.
ఆలయాలపై దాడులు చేస్తున్నవారు తనకు తెలుసని జగన్ అన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా.. డీజీపీ వెంటనే సీఎంకు నోటీసు ఇచ్చి…ఆలయాలు ధ్వంసం చేసిందెవరో చెప్పించాలని కోరారు. తన లేఖతో లేఖతో పాటు జగన్ ప్రసంగ వీడియోను కూడా జత చేశారు. మాజీ పోలీసు అధికారి అయిన వర్ల రామయ్య.. ఏయే సెక్షన్ కింద జగన్కు నోటీసులివ్వాలో కూడా వివరించారు. వర్ల రామయ్య ఇలా టార్గెట్ చేయడానికి కారణం గతంలో.. చంద్రబాబుకు డీజీపీ లేఖలు రాయడమే. చిత్తూరు జిల్లాలో జరిగిన దళిత యువకుడి అనుమానాస్పద మృతి… ఇతర కేసుల్లో.. చంద్రబాబు రాసిన లేఖలకు ఆధారాలివ్వాలని డీజీపీ ప్రత్యత్తురం చేశారు.
మాజీ ముఖ్యమంత్రికి ఆధారాల కోసం లేఖలు రాసినప్పుడు.. ముఖ్యమంత్రికి మాత్రం ఎందుకు రాయరని టీడీపీ లాజిక్. పోలీసుల పని తీరును ప్రశ్నించడానికి ప్రజల్లో హైలెట్ చేయడానికి టీడీపీ ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటోంది.తమపై విమర్శలు వస్తున్నా… పోలీసులు మాత్రం.. నిందితుల్ని పట్టుకోవడం కన్నా… ప్రెస్మీట్లు పెట్టి.. ఏదో ఒకటి చెప్పడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నిందితుల్ని మాత్రం పట్టుకోలేకపోతున్నారు.