నంద్యాల ఉప ఎన్నికకు అభ్యర్థిని చంద్రబాబు ఓకే చేసిన మరుక్షణం తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగిపోయింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా పరిణమించిన ఈ సీటులో గెలుపు టీడీపీకి జీవన్మరణ సమస్య. ఇక్కడ నెగ్గి రాయలసీమలో ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టాలనే వ్యూహంతో తెలుగుదేశం పనిచేస్తోంది. భూమా నాగిరెడ్డి అన్నకుమారుడు బ్రహ్మానంద రెడ్డిని నంద్యాల అభ్యర్థిగా శనివారం రాత్రి ఖరారు చేశారో లేదో… ఆదివారం తెల్లవారుఝామునే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నంద్యాలలో ప్రత్యక్షమయ్యారు. వీధుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ ఒక్క పర్యటన చాలు పార్టీ ఈ ఉప ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందీ చెప్పడానికి. నంద్యాలలో పారిశుద్ధ్య పరిస్థితులు అంత అధ్వానంగా ఉన్నాయా లేక మెరుగుపరచాలనుకుంటున్నారా? ఏదేమైనా ఉన్నట్టుండి ఏలినవారికి నంద్యాలపై ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఇప్పుడు మంత్రి నారాయణ..రేపు విద్యుత్తు శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు…సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కాఆనంద్ బాబు… ఇలా ప్రతి శాఖ మంత్రినీ నియోజకవర్గంలో పర్యటింపజేసి, ఓటర్లను బుట్టలో వేసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుంది. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చేలోగా స్వామికార్యాన్ని చక్కబెట్టేసే యోచన కనిపిస్తోంది. ఇదెంతవరకూ ఫలిస్తుంది? ఇలాంటి పర్యటనలకూ..చర్యలకూ ఓటర్లు తలొగ్గుతారా? తమ నిర్ణయాన్ని అపహాస్యం పాలు చేసిన ఎమ్మెల్యేలను వారు మళ్ళీ ఆమోదిస్తారా? ఏపీలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇది. శిల్పామోహన్ రెడ్డి ప్రాబల్యం ఎంతనేది కూడా ఇందులో తేలిపోతుంది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి