తెలుగుదేశం పార్టీలో ఓ చర్చ తరచూ వినిపిస్తూ ఉంటుంది! అదేంటంటే… నాయకుల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు, సర్వేలు చేయించుకుంటారు, నివేదికలు తెప్పించుకుంటారు అంటారు! వాటి ఆధారంగానే పార్టీలో నాయకుల ప్రాధాన్యత పెంచడం, తగ్గించడం వంటివి ఉంటాయనీ, పార్టీలో పదవులతోపాటు ఎన్నికల్లో టిక్కెట్లను కూడా నిర్దేశించేవి ఈ తరహా నివేదికలే అని తరచూ చెబుతుంటారు. అయితే, ఇన్నాళ్లూ నాయకుల ప్రతిభను తూకం వేసే కొలమానాలు ఏంటయ్యా అంటే… ఎమ్మెల్యేలు, మంత్రులూ అయితే వారి సొంత నియోజక వర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం. దీంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు పక్కగా జరిగేట్టు చూడటం! ఇతర నాయకులైతే పథకాల అమలును పర్యవేక్షించడం, లబ్ధిదారులను గుర్తించడం. ఇప్పుడు ఈ గణనలో ఓ కొత్త కొలమానాన్ని పార్టీ అధినాయకత్వం చేర్చినట్టు తెలుస్తోంది.
ఏ రాజకీయ పార్టీకి అయినా కార్యకర్తలే మూల స్తంభాలు. అందుకే, కార్యకర్తల్ని బాగా చూసుకోవాలనేదే ప్రథమ ప్రాధాన్యతాంశంగా ఉంటుంది. ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం కూడా నేతల పనితీరును కార్యకర్తల కోణం నుంచి విశ్లేషించే ప్రయత్నం చేస్తోందట! ఎలా అంటే, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలపై తక్షణం స్పందిస్తున్నారా లేదా..? కార్యకర్తల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏ మేరకు పనిచేస్తున్నారు..? ఏయే నాయకులు పార్టీ కార్యకర్తల్ని ఎంత మేర సంతృప్తిపరుస్తున్నారు అనే అంశంపై పార్టీ అధినేత ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. పదవులు వచ్చిన దగ్గర నుంచీ నేటి వరకూ కార్యకర్తల కోసం ఏయే నేతలు ఎంతగా కృషి చేస్తున్నారు అనేది ఆరా తీస్తున్నారట!
ఉన్నట్టుండీ నాయకుల పనితీరుకి కార్యకర్తల సంతృప్తి అనేది కొలమానంగా ఎందుకు మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ వైకాపా అధినేత పాదయాత్ర అంటూ ఎన్నికల మూడ్ తెచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేయాలంటే ముందుగా కార్యకర్తల్ని క్రియాశీలం చేయాలి. అది జరగాలంటే.. పార్టీ తమను చాలా బాగా చూసుకుంటోందన్న నమ్మకం వారిలో రావాలి. ఇది జరగాలంటే కార్యకర్తల విషయంలో నాయకుల బాధ్యత పెరగాలి. ఆ బాధ్యత వారిలో పెరగాలంటే.. నాయకుల పనితీరుకు ఇదో కొలమానం అవుతుందని అధినాయకత్వం గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఇదే! ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో కాస్త ముందున్నారని చెప్పొచ్చు. కార్యకర్తల నుంచి సోషల్ మీడియా ద్వారా అందుతున్న ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక, వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా కార్యకర్తల విషయంలో ఈ మధ్య చాలా చురుగ్గా స్పందిస్తున్నారనీ, తన దృష్టికి వచ్చిన కార్యకర్తల ఇబ్బందులపై వెంటనే స్పందిచేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో అంటున్నారు.