తెలుగుదేశం పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ప్రస్తుతం హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ ఇదే. తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు కొందరు నాలుగు రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారన్న రూమర్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. మరి ఆ నిర్ణయం చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందా లేక చంద్ర బాబుకి జలక్ ఇస్తుందా అన్న చర్చ బలంగా కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే..
ట్రిగ్గర్ పాయింట్ గా మారిన ఆమంచి ఎపిసోడ్:
మొన్నామధ్య చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ వీడనున్నారన్న రూమర్లు గట్టిగా వినిపించాయి. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమంచి కృష్ణమోహన్ తో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా కృష్ణమోహన్ ఏది తేల్చకుండా సస్పెన్స్ లో ఉంచారు . కృష్ణమోహన్ గోదావరి జిల్లా రామచంద్రపురం లోని తోట త్రిమూర్తులు ఇంట్లో ప్రత్యక్షం కావడం, ఆయనతో భేటీ అవ్వడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే కృష్ణమోహన్ ఎపిసోడ్ కారణంగా బయటకు తెలిసిన నిజం మాత్రం ఒకటి ఉంది- అదేంటంటే టిడిపి కాపు నేత తోట త్రిమూర్తులు ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారని, ఈ గ్రూపు ఎమ్మెల్యేలంతా కలిసి త్వరలోనే ఒక సమిష్టి నిర్ణయం తీసుకోనున్నారని. అయితే ఫిబ్రవరి 13న తోట త్రిమూర్తులు కుమారుడి వివాహం ఉండడంతో, ఆ వివాహం తర్వాత తోట త్రిమూర్తులు కేంద్రంగా తెలుగుదేశం పార్టీలోని కాపు ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
గంటా వర్సెస్ తోట:
అయితే తెలుస్తున్న వివరాల ప్రకారం, తెలుగుదేశం పార్టీ లోని కాపు ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. ఒక వర్గానికి తోట త్రిమూర్తులు నాయకత్వం వహిస్తుంటే మరొక గ్రూపు కి గంట శ్రీనివాస్ నాయకత్వం వహిస్తున్నారు. గంటా వర్గం లో అవంతి శ్రీనివాస్ లాంటి కొందరు నాయకులు ఉన్నారు. గంటా వర్గం, కాపు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి ఆశించి దానిని పొందలేకపోయిన తోట త్రిమూర్తులు మాత్రం తన గ్రూపు తో సహా కీలక నిర్ణయం తీసుకునే ఉద్దేశం లో ఉన్నారని తెలుస్తోంది.
ఫిబ్రవరి 13 తర్వాత ఏం జరగనుంది?
ఫిబ్రవరి 13న తోట త్రిమూర్తులు కుమారుడు వివాహానికి కాపు ఎమ్మెల్యేలు అందరూ హాజరు కానున్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం తదితర నేతలు కూడా ఈ పెళ్లికి రానున్నారు. ఈ వివాహ వేడుక తర్వాత తోట త్రిమూర్తులు వర్గం తీసుకునే నిర్ణయం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలా లేక వైఎస్ఆర్ సీపీ కానీ జనసేన కాని చేరాలా అన్నది వారి ముందున్న ఆప్షన్స్.
కానీ ఇటు ఆమంచి కృష్ణమోహన్ కి కానీ అటు తోట త్రిమూర్తులు కానీ చంద్రబాబు నాయుడు సరైన హామీ ఇవ్వలేదని, దీంతో వారు తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారని రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం బలంగా ఉండడం చేత వై ఎస్ ఆర్ సి పి కంటే కూడా జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు జనసేన లో ఈ స్థాయి నాయకులు ఎవరు చేరకపోవడంతో, నిజంగానే తోట త్రిమూర్తులు వర్గం జనసేనకు వెళుతుందా అన్న విషయంలో జనాలకు ఇంకా స్పష్టత రావడం లేదు. అదే కనుక నిజమైతే , ఒకవేళ టిడిపిని వీడాల్సి వస్తే తోట త్రిమూర్తులు వర్గం ఎమ్మెల్యేలు మొత్తం వైఎస్సార్సీపీకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు అంటున్నారు. అయితే ఉన్నట్టుండి సర్ప్రైజ్ ఇవ్వడంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉండడంతో ఇప్పుడు కూడా తోట త్రిమూర్తులు వర్గాన్ని జనసేన లో చేరేలా చేసి రాజకీయ వర్గాలకు షాక్ ఇస్తారని జనసేన అభిమానులు భావిస్తున్నారు.
మొత్తం మీద:
ఎన్నికలకు కేవలం రెండు నెలలు మాత్రమే సరిగ్గా సమయం ఉండడంతో, రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మరి ఫిబ్రవరి 13 తర్వాత ఈ రాజకీయ పరిణామాలు ఏ టర్న్ తీసుకుంటాయనేది వేచి చూడాలి.