బిజెపి ఎంఎల్‌సి సోము వీర్రాజు తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలకు పేరు గాంచారు. వీలు చిక్కితే ఒంటికాలిపై లేచే ఈ పెద్దమనిషిని టిడిపి వారు తరచూ విమర్శిస్తుంటారు.అయితే ఆయన ఆరెస్సెస్ మనిషి కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరు. అయితే తెలుగుదేశంలోనూ కొందరికి తమను ఇబ్బంది పెడుతున్న బిజెపి పోకడల పట్ల విపరీతమైన ఉక్రోషం.కాని ఏదైనా మాట్టాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే మందలిస్తుంటారు. ఇటీవలనే ఎంఎల్‌సి రాజేంద్ర ప్రసాద్‌కు అక్షింతలు వేశారని సమాచారం. అయితే తాజాగా ఒక ఎంపి ఎంఎల్‌సి బిజెపిపై ధ్వజమెత్తారు. వివాదాలకు మారుపేరైన జెసి దివాకరరెడ్డి తమ పని కేంద్రంలో కరివేపాకులా తయారైందని వాపోయారు. ఇక విజయనగరంలో ఎంఎల్‌సి ద్వారపురెడ్డి జగదీశ్ మరో అడుగు ముందుకేసి గుజరాత్లో దెబ్బతిన్న తర్వాత కూడా ఎపి పట్ల బిజెపి వైఖరి మారడం లేదని ధ్వజమెత్తారు. ప్రత్యేక హౌదా ప్యాకేజీ ఏదీ లేకుండా పోయిందని ఆగ్రహించారు. విశాఖ రైల్వేజోన్‌ను కూడా పక్కనపెట్టడంపై ఆయన విమర్శలు గుప్పించారు. మరో వైపున బిజెపి ఎంఎల్‌సి మాధవ్ మాత్రం తాము ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామనిప్రకటించారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపి వైవీసుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలసి రాష్ట్రాన్నిఆదుకోవాలని అభ్యర్థించారు. ఈ విధంగా వైసీపీ టీడీపీ వైరాన్ని కూడా ఉపయోగించుకోగల అవకాశం బిజెపికీ కేంద్రానికి లభిస్తున్నది.