టీడీపీ నేతల్ని వైసీపీలో చేర్చే బాధ్యతల్ని టీఆర్ఎస్ తీసుకుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సమయంలోనే… టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమయ్యారు. ప్రత్యేకంగా తలసాని ఇంటికి వచ్చిన త్రిమూర్తులు గంటకుపైగా ఆయనతో చర్చలు జరిపారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అవంతి, ఆమంచితో తనకు మంచి స్నేహం ఉందని.. తోట త్రిమూర్తులు గతంలోనే ప్రకటించారు. అయితే.. అది స్నేహం మాత్రమే కాదని… ముగ్గురూ కలిసి హైదరాబాద్ లో భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీరు ముగ్గురూ కలిసి ఇటీవలి కాలంలో ఓ డిస్టిలరీస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నారని చెబుతున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ ఇంకా పెండింగ్ లో పెట్టి.. వారిని ఒత్తిడికి గురి చేసి..వైసీపీలో చేర్పిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మొదటగా ఆమంచి, ఆ తర్వాత అవంతి వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు టీడీపీని తోట త్రిమూర్తులు వీడతారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో తలసానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీని వీడే ముందు తోట త్రిమూర్తులుతో ఆమంచి భేటీ అయ్యారు. త్రిమూర్తులును కలిసొచ్చాక ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు.ఆమంచి పార్టీ వీడిన తర్వాత అవంతి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. అప్పుడే త్రిమూర్తులు కూడా పార్టీని వీడతారని ప్రచారం జరిగింది. త్రిమూర్తులు కూడా టీడీపీలో కచ్చితంగా ఉంటానని స్పష్టంగా చెప్పలేదు..ఇప్పుడు తలసానితో భేటీ కావడంతో.. ఆయన వైసీపీలో చేరికపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
హైదరాబాద్ లో ఆస్తులున్న నేతలను బెదిరించి… వైసీపీలో చేర్పించడం.. వ్యతిరేకంగా మాట్లాడించడం చేస్తున్నారని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. తలసాని కూడా.. ఏపీకి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలతో ఆయనకు ఉన్న పరిచయాలతో… మొత్తం వ్యవహారాల్ని డీల్ చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.