రాజకీయ నాయకులందరికీ సహజంగానే వ్యాపారాలుంటాయి. ఆస్తులుంటాయి. లేకపోతే రాజకీయాలు చేయలేరు. ఎక్కువ మంది హైదరాబాద్ చుట్టుపక్కలే వ్యాపారాలు చేస్తూంటారు. అదే ఇప్పుడు… టీడీపీ నేతలకు గండంగా మారింది. కొంత మంది భూముల్లో… ప్రభుత్వ స్థలం అనే బోర్డులు వెలుస్తున్నాయి. కొంత మందికి రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు పాల్పడ్డారనే నోటీసులు అందుతున్నాయి. మరికొంత మందికి.. ఎప్పుడో… జరిగిన వ్యవహారాల వెనుక లావాదేవీలు చెప్పాలని సమాచారం వస్తోంది. హోటళ్ల లాంటి వ్యాపారాలు ఉన్న వారికి.. నిబందనలు పాటించలేదు ఎందుకన్న హూంకరింపులు వస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడు.. ఏపీ టీడీపీలో హాట్ టాపిక్ అయ్యాయి.
హైదరాబాద్ లో ఆస్తులున్న తమ నేతలను బెదిరిస్తున్నారని.. చంద్రబాబు ఆషామాషీగా అనలేదని.. కొంత మందికి వచ్చిన బెదిరింపులను దృష్టిలో పెట్టుకునే చెప్పారని టీడీపీ నేతలు అంటున్నారు. ఓ టీడీపీ ఎమ్మెల్యేకు నగర శివారులో.. కొంత స్థలం ఉంది. హఠాత్తుగా ఆ స్థలంలో… విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం ప్రారంభించారు. కనీసం.. సబ్‌స్టేషన్‌కు ఆ స్థలం అవసరం కాబట్టి.. సేకరిస్తున్నామన్న సమాచారం కూడా ఇవ్వలేదు. ముందస్తుగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టేశారు. మరో ఎమ్మెల్యేకు కూడా ఇలాంటి కారణంతోనే నోటీసులు జారీ అయ్యాయని ప్రచారం జరుగుతోంది. మరో ఎమ్మెల్యేకు… ఎప్పుడో కొన్న భూముల రిజిస్ర్టేషన్ లో ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించారని .. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని… బోర్డులు కూడా పెట్టేశారట. హైదరాబాద్‌లో హోటల్ ఉన్న ఓ ఎమ్మెల్యేకు నియమ, నిబంధనల పేరిట.. వరస తాఖీదులు వస్తున్నాయట.
అంతే కాదు.. ద్వితీయ శ్రేణి నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయన్న ప్రచారం జరుగుతోంది. ఐటీ నోటీసులు జారీ చేసి.. వారిని టీడీపీలో యాక్టివ్ కాకుండా చేస్తున్నారు. ఓ ఎంపీకి ఇటీవల ఓ నోటీసు వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే.. 14 ఏళ్ల కిందట.. ఓ చెక్కు ద్వారా కాంగ్రెస్ నేత చిదంబరానికి చెల్లింపులు చేశారు. ఎందుకు చేశారంటూ… ఈడీ నుంచి నోటీసు వచ్చింది. అప్పటి లెక్కలు బయటకు తీసి మరీ.. నోటీసులు పంపుతున్నారంటే.. టీడీపీని ఎంతగా టార్గెట్ చేశారో అర్థం చేసుకోవచ్చన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకుని ఎంత మంది పార్టీ మారుతారోనన్న ఆందోళన.. వారిలో వ్యక్తమవుతోంది.