“ఆంధ్రా ఎంపీలకి తమ వ్యాపారాల మీద ఉన్నంత శ్రద్ద ప్రత్యేక హోదా సాధించడంపై లేదు. మనోళ్ళకి మోడీ అంటే చాలా భయం. అందుకే నోరుమెదపకుండా కూర్చొని పార్లమెంటు గోడలని చూస్తూ కాలక్షేపం చేసి వచ్చేస్తుంటారు. మనోళ్ళ కంటే తెలంగాణా ఎంపీలే చాలా నయం. వారి రాష్ట్రం కోసం పార్లమెంటులో గట్టిగా పోరాడుతుంటారు.” ఈ మాటలు ఎవరన్నారో అందరికీ తెలుసు. బహుశః ఆ దెబ్బకి జడిసిన తెదేపా ఎంపీలు గురువారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలో గాంధీజీ విగ్రహం దగ్గర ప్లకార్డులు పట్టుకొని ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయాలని, విభజన బిల్లులో ఉన్న హామీలన్నిటినీ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసారు.
‘పోనీలే ఇన్నాళ్ళకు మనోళ్ళు దైర్యంగా నోరువిప్పి మనకి కావలసిందేమిటో చెప్పారు’ అని రాష్ట్రంలో జనాలు సంతోషపడుతుంటే, జేసీ దివాకర్ రెడ్డి రెండు పంచ్ డైలాగులతో గాలి తీసేశారు. దేని గురించయినా నిర్భయంగా కుండలు బ్రద్దలు కొట్టి చెప్పేసే అలవాటున్న జెసి తమ ధర్నా గురించి మరో కుండ బ్రద్దలేసేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇటువంటి ధర్నాల వలన ఏమీ ప్రయోజనం ఉండదని మాకు తెలుసు. కానీ ఏదో ప్రజలని ఊరడించడానికి, పవన్ కళ్యాణ్ న్ని చల్లబరచడానికే ఇది ఉపయోగపడుతుంది,” అని మనసులో మాట బయట పెట్టేశారు. దానితో తెదేపా ఎంపీలు ధైర్యం చేసి ధర్నా చేసినా వ్రతం చెడినా ఫలం దక్కనట్లయింది.
కానీ ఇక్కడ మరో విషయం చెప్పుకోక తప్పదు. ఓ నాలుగయిదు రోజుల క్రితమే కేంద్రమంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదాకి సంబంధించి దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా మరొక నెల్లన్నరలోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. కనుక అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి తన నిర్ణయం ప్రకటించవచ్చును. రైల్వే జోన్ మంజూరు చేయడానికి కొన్ని ఆర్ధిక అవరోధాలు ఎదురవుతున్నాయి. కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత కేంద్రమంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రానికి రైల్వే జోన్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవచ్చును,” అని తెలిపారు. అంటే ఈరోజు ధర్నా చేసిన తెదేపా ఎంపీలందరికీ కూడా ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. కానీ ధర్నా చేసారంటే? దివాకర్ రెడ్డి చెప్పిందే నిజమనుకోవాలి మరి!