తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన షాక్ నుంచి ఆ పార్టీలో మిగిలి ఉన్న నేతలు ఇప్పటి వరకూ తేరుకోలేదు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా.. ఎవరూ.. ఎన్నికల గురించి ఆలోచించలేదు. దాంతో.. టీ టీడీపీ పోటీ చేస్తుందా.. లేదా.. అన్న దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. చివరికి గత ఎన్నికల్లో ప్రజాకూటమిగా ఏర్పడిన పార్టీలు కూడా.. ఈ సారి పొత్తుల గురించి మాట్లాడుకోలేదు. కాంగ్రెస్ పార్టీ తన మానాన తాను అభ్యర్థులను ఎంపిక చేసుకుంది. టీడీపీని సంప్రదించలేదు. కమ్యూనిస్టులు, కోదండరాంను కూడా సంప్రదించలేదు. దాంతో.. ఆ పార్టీలన్నీ ఈ సారికి.. దూరంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మాదిరి ఫలితాలు వచ్చినా… పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం మల్కాజిగిరి, ఖమ్మం పార్లమెంట్ స్థానాలను పొందాలని.. టీడీపీ అనుకుంది. కానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన షాక్తో.. అసలు పోటీ నిర్ణయమే విరమించుకుంది. చివరికి ఖమ్మం బరిలో ఉంటారనుకున్న నామా నాగేశ్వరరావు కూడా.. పార్టీకి గుడ్ బై చెప్పి.. టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడటంతో.. ఉన్న ఒకే ఒక్క హోప్ కూడా.. లేకుండా పోయింది. ఇప్పటి పరిస్థితుల్లో.. కాంగ్రెస్కు మద్దతు పలకడమే మంచిదన్న ఉద్దేశంతో.. ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా… టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఫోన్ చేసి మద్దతు కోరినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇది అత్యంత పతనావస్థ. ఇప్పటి వరకూ.. టిక్కెట్ల కోసం పోటీ పడ్డవారే కానీ… పోటీ చేయలేని స్థితికి తెలంగాణలో టీడీపీ ఎప్పుడూ లేదు. తెలంగాణలో బడుగులకు రాజ్యాధికారం దక్కేలా చేసింది టీడీపీ అన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఇలాంటి టీడీపీని ప్రజలు ఆదరించలేని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు ముందు ముందు మారుతాయని..టీడీపీ నేతలు ఆశ పడుతున్నారు. కానీ.. అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు.