రైతులకు లక్షన్నర రుణమాఫీ చేసిన ఏపీ ప్రభుత్వం.. వాటిని.. విడతల వారీగా విడుదల చేస్తోంది. ఐదు సంవత్సరాలలో రైతులకు లక్షన్నర రూపాయల మేరకు ఐదు విడతలలో మాఫీ చేయాలని నిర్ణయించింది. మొత్తం రూ. 25 వేల కోట్ల రుణాల్లో ఇప్పటికే మూడు విడతలలో రూ. 15 వేల 670కోట్లను రైతులకు విడుదల చేసింది. నాలుగు, ఐదు విడతల కింద ఎనిమిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. యాభై వేల రూపాయల లోపు రుణాలు ఉన్న రూ. 23 లక్షల 45వేల మంది రైతులకు రూ. 4 వేల 337కోట్ల రూపాయలను ఒకే విడతలో మాఫీ చేసింది. కౌలు రైతులకు రూ. 494 కోట్లనువిడుదల చేసింది.
ఇప్పుడు నాలుగు, ఐదు విడతల రుణమాఫీ కింద రైతులకు ఎనిమిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీన నాలుగో విడత రుణమాఫీ కింద రూ. 3వేల 600కోట్ల రూపాయలను రైతులకు విడదల చేయనుంది. బ్యాంకులలో ఉన్న రైతుల ఎకౌంట్లకు జమ చేసేందుకు ఆర్ధిక శాఖ బ్యాంకులకు నిధులను విడుదల చేయనుంది. 58 లక్షల మంది రైతులకు ఈ డబ్బులు అందనున్నాయి. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద ఒకే విడతలో రుణాన్ని మాఫీ చేశారు. పోలింగ్ కు 48గంటల ముందు ఒకవైపు డ్వాక్రా మహిళలు 98లక్షల మందికి, పదివేల రూపాయల చొప్పున పసుపు కుంకుమ పధకం కింద ప్రభుత్వం విడుదల చేసింది. అన్నదాత సుఖీభవ పధకం, రుణమాఫీ పధకాల కింద సుమారు రూ. 5వేల కోట్లను విడుదల చేసింది. పెన్షనర్లకు ఒక్కొక్కరికీ రెండు వేల రూపాయల చొప్పున 56లక్షల మందికి పెన్షన్లను కూడా ఇప్పటికే అందించింది. ఇవన్నీ ఓట్లు పండిస్తాయని టీడీపీ ఆశ పెడుతోంది.
మరి ఐదో విడత రుణమాఫీ ఎప్పుడు చేస్తారు..?. మళ్లీ జగన్ వస్తే టీడీపీ హామీని తాము ఎందుకు అమలు చేయాలన్న ఉద్దేశంతో.. కచ్చితంగా పక్కన పెట్టేస్తారు. ఆ విషయంలో రైతులకు అవగాహన ఉంటుంది. అందుకే.. టీడీపీ కూడా వ్యూహాత్మకంగా.. ఓ వాయిదాను పెండింగ్లో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ టీడీపీ వస్తే.. అది కూడా మాఫీ అవుతుందన్న భావన రైతుల్లో ఏర్పడటానికి ఇలా చేస్తున్నట్లుగా ఉంది. మొత్తానికి… అన్ని వర్గాల ప్రజలకు.. సాయం అందేలా… ఓ పక్కా ప్రణాళిక ప్రకారం.. టీడీపీ సంక్షేమ పథకాలను ఉపయోగించుకుంటోందని..వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు.