ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పోరులో పైచేయి సాధించేందుకు రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ లు మైండ్ గేమ్ కు తెరతీశాయి. ప్రత్యర్థిని మానసికంగా బలహీనం చేసి… స్వీయబలంపై తనకే నమ్మకం సడలిపోయేటట్టు చేసేలా సర్వేలు ప్రకటించేసుకుంటున్నారు. ఓటర్లకు నేరుగా మెసెజులు కూడా పెడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎత్తుకు పై ఎత్తులు వేయడం, ప్రత్యర్ధి వర్గం కదలికలను తెలుసుకోవడం సహజంగా జరుగుతుంది. కానీ ప్రత్యర్ధి వర్గం కంటే ఒక అడుగు ముందు ఉండాలని టీడీపీ, వైసీపీ భావిస్తున్నాయి. వైసీపీ ఈ మైండ్ గేమ్‌లో ముందు ఉంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మౌత్ టాక్ ఆపరేషన్ ప్రారంభించారు.
సర్వేల పేరుతో.. వైసీపీ అభ్యర్థులకు ధైర్యం చెబుతున్నారు. అభ్యర్దులకు వచ్చే ఓట్ల పర్సంటేజ్ ఎంత అనేది డేటా బ్యాంకు ద్వారా నియోజకవర్గంలోని ఓటర్లకు ఫోన్ మెసేజ్ లు పంపిస్తున్నారు. ఈ అలవాటును కొంతమంది జనసేన అభ్యర్దులు కూడా అలవరుచుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనసేన అభ్యర్ధి తోట చంద్రశేఖర్ పీకే సర్వే, సీఓటర్ సర్వే, నీల్సన్ సర్వే అంటూ.. ఏవేవో సర్వేల పేర్లతో… తాను ముందున్నానని, ఆ నియోజకవర్గంలోని మెజార్టీ ఓటర్లకు ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు. ఎవరిదైనా ఓటర్ నెంబర్ ఉంటే.. ఓటు వేయమని మెసెజ్ పంపుతారు కానీ.. తాను ముందున్నానని చెప్పుకోవడం ఏమిటన్న చర్చ అందరిలోనూ నడుస్తోంది. ముందున్నాను కాబట్టి.. తనకే ఓటు వేయమని.. ఓ రకంగా ఆయన ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
పోలింగ్ కు నాలుగు రోజుల ముందుగానే వైసీపీ, టీడీపీ.. మేమే గెలవబోతున్నామనే సందేశాలను… ఒక పార్టీ నుంచి మరో పార్టీకి పంపుతూ… ఆడాల్సిన మైండ్ గేమ్ ఆడేస్తున్నాయి. ఇందులో ఓటర్లను చొప్పించేస్తున్నాయి. మేమే గెలుస్తాం.. మేమే గెలుస్తాం.. అని హోరెత్తిస్తున్నాయి. అయితే.. ఇవి ఓటర్ల అభిప్రాయాలను మారుస్తాయో లేదో చెప్పలేము కానీ.. ఓటింగ్ పెరగడానికి మాత్రం అవకాశం కనిపిస్తోంది. అమ్మో.. ఆ పార్టీ వస్తుందని… అంటున్నారు… రాకుండా ఉండాలంటే.. కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే స్పృహ ఓటర్లలో పెరుగుతోంది. ఈ మైండ్ గేమ్ ఓ రకంగా ఓటర్లకు మంచే చేసే అవకాశం కనిపిస్తోంది.