హీరోలు, హీరోయిన్లతో పాటలు పాడించిన ఓల్డ్ ఫ్యాషన్. డైరెక్టర్లతోనూ గొంతు కలిపించడం కొత్త ట్రెండ్. అనూప్ ఇప్పుడు అదే చేశాడు. ‘సీత’ సినిమాకి అనూప్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం వెరైటీగా ఓ పాటలో తేజ గొంతు వినిపించాడు. ‘బుల్లెట్టు మీదొచ్చే బుల్రెడ్డీ’ అంటూ ఈ సినిమాలో ఓ ఐటెమ్ పాట కంపోజ్ చేశాడు అనూప్. పాయల్ రాజ్‌పుత్ ఇందులో చిందులు వేసింది. ఈ పాటలో తేజ గొంతు కూడా వినిపిస్తోంది. మంచి ఐటెమ్ బీట్ ఇది. పాయల్ గ్లామర్, స్టెప్పులు ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సాధారణంగా తేజ ఐటెమ్ గీతాలకు అంత స్పేస్ ఇవ్వడు. కానీ.. ‘సీత’లో పనిగట్టుకుని మాస్ మసాలా పాటని కంపోజ్ చేయించాడు. అవుట్ పుట్ కూడా బాగానే వచ్చినట్టు అనిపిస్తోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ జంటగా నటించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందనే వచ్చింది. ఈ పాట దానికి ఇంకొంచెం ప్లస్ అయ్యింది. ఈనెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.