తెలంగాణలో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని చెప్పడానికో .. లేకపోతే సీనియర్ నేతల అవసరం ఉందనుకుంటున్నారో కానీ తెలంగాణలో ఖాళీగా ఉన్న నేతలందరికీ బీజేపీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్‌కు రోజూ అదే డ్యూటీ అయిపోయింది. తాజాగా ఆయన మాజీ ఎమ్మెల్యే జయసుధకు సమాచారం పంపారు. బీజేపీలో చేరాలన్నారు. అయితే ఆమె గత ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. తర్వాత వైసీపీ వాళ్లకు ఆమె గుర్తు లేదు. ఆమె కూడా పట్టించుకోలేదు.
ఇప్పుడుబీజేపీ కూడా కండువా కప్పుకోవాలని పిలిచింది. ఎన్నికల్లో పోటీ చేసి ఓపిక లేదని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అంగీకరిస్తారో లేదో తెలియదు. అదే సమయంలో టీడీపీలో కీలకంగా ఉండి.. తర్వాత టీఆర్ఎస్లో చేరినా ఎలాంటి ఆదరణ లేని నిజామాబాద్‌కు చెందిన కీలక నేత మండవ వెంకటేశ్వరరావుకు కూడా ఈటల బృందం ఫోన్ చేసింది. దీంతో ఆయన కకూడా డైలమాలో ఉన్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కుమార్తె విజయం కోసం ఇంటికెళ్లి మరీ కండువా కప్పిన కేసీఆర్ తర్వాత ఆయనను పట్టించుకోలేదు.
ఎమ్మెల్సీ.. రాజ్యసభ ఎన్నికల సమయంలో పేర్లను ప్రచారం చేస్తారు కానీ చివరికి హ్యాండిచ్చారు. ఇప్పుడు ఆయన కూడా బీజేపీ వైపు చూస్తారేమోతెలియదు. ఇలా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండి ఖాళీగా ఉన్న నేతలకు కండువా కప్పాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున చేరికలను చేశానని చెప్పుకునేందుకు ఈటల తాపత్రయ పడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.