నాయకులు కావలెను..! బీసీ కులానికి చెందినవారై ఉంటే చాలు. ప్రస్తుతం తెలంగాణలో భాజపా వెతుకులాట ఇదే అని సమాచారం! ఈ నెలలో తెలంగాణలో పర్యటించేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టి. భాజపాని మరింత బలపరచే వ్యూహాలపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సహజంగానే హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించడం అనేది భాజపా ప్రాథమిక లక్షణం. దీన్లో భాగంగా ఈ మధ్య ముస్లింల రిజర్వేషన్ల ఇష్యూని తలకెత్తుకుని, కేసీఆర్ సర్కారుకు వ్యతిరకంగా ఓ మాదిరి పోరాటం చేసింది. ఇలాంటి అవకాశం మున్ముందు ఏది వచ్చినా భాజపా అందిపుచ్చుకోవడం కోసం సిద్ధంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే, ఇప్పుడు బీసీలపై భాజపా కన్నేసింది.
తెలంగాణకు చెందిన కొంతమంది బీసీ నేతలతో భాజపా పెద్దలు టచ్ లోకి వెళ్లినట్టు కథనాలు ఉన్నాయి. హైదరాబాద్ కాంగ్రెస్ లో దాదాపు పదేళ్లపాటు చక్రం తిప్పిన దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, ముఖేష్ గౌడ్ వంటి నేతలపై భాజపా దృష్టి ఉన్నట్టు అంటున్నారు. వీరి విషయమై కూడా త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందని సమాచారం. వీరితోపాటు బీసీల నుంచి అన్ని స్థాయిల్లో వలసల్ని ప్రోత్సహిస్తుందన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా కొంతమంది బీసీ నేతలు పార్టీలో చేరితే బాగుంటుందనీ, బీసీ అనుకూల ప్రచారాన్ని ఇప్పట్నుంచే మొదలుపెట్టినట్టు అవుతుందనీ భావిస్తున్నారట. ఆ దిశగా చర్చలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇకపై, అమిత్ షా తరచూ తెలంగాణకు వస్తుంటారని భాజపా నేతలు అంటున్నారు. భాజపా పొలిటికల్ స్ట్రాటజీ టీమ్ ఇప్పటికే తెలంగాణకు వచ్చిందనీ, రాష్ట్రంలోని అన్ని పరిస్థితులపైనా అధ్యయనం చేస్తోందనీ, ఎప్పటికప్పుడు అమిత్ షాకు నివేదికలు పంపుతోందని కూడా ఓ ప్రచారం ఉంది. తెలంగాణలో పార్టీ విస్తరణను భాజపా చాలా సీరియస్ గా తీసుకున్నదనేది మాత్రం స్పష్టంగా అర్థమౌతోంది.
భాజపా మొదలుపెడుతున్న బీసీ నేతల ఆకర్షణ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇప్పటికే దళితుల్ని దగ్గర చేర్చుకునే దిశగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. ఈ మధ్యనే మంద కృష్ణ మాదిగతో భాజపా నేతలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు బీసీలపై ఫోకస్ పెడుతున్నారు. అమిత్ షా పర్యటన నాటికి తెలంగాణ భాజపాలో చేరబోయే ఆ కొత్త బీసీ నేతలు ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.