తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ. రెండు లక్షల కోట్లను దాటనున్నారు. దేశంలో ఆదాయవృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్లే బడ్జెట్ కూడా… ఇరవై శాతం వరకూ పెరిగే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల కారణంగా తెలంగాణలోనూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్టే ప్రవేశపెట్టాలని సీఎం ఎప్పుడో నిర్ణయించారు. బడ్జెట్ కసరత్తు అంతా తానే చేశారు. ఆర్థికశాఖను ఎవరికీ కేటాయించక పోవడంతో కేసీఆరే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది బడ్జెట్ కంటే సుమారు 20 శాతం వృద్ధి తో 2019 – 20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ లెక్కల ప్రకారం తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఇది తాత్కాలిక బడ్జెట్ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించనున్నారు.
పెన్షన్లు పెంచుతామని 57 ఏళ్లు నిండిన వారికి కొత్తగా పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. లక్ష లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు ఏడాదికి ఎనిమిది వేల నుండి పదివేల రూపాయలకు పెంచుతామని సీఎం కేసీఆర్ ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.ఈ హామీలన్నింటికీ అవసరమయ్యే నిధులను బడ్జెట్లో కేటాయించాల్సి ఉంది. ఆర్థిక శాఖ ఎన్నికల హామీలకు అవసరమైన నిధుల లెక్క తేల్చింది. ఆసరా పెన్షన్ పథకానికి ఇప్పటివరకు ఏడాదికి 6,600 కోట్లు ఖర్చవుతోంది. అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో పెన్షన్లు రెట్టింపు చేయడం వల్ల వచ్చే ఏడాది నుండి 13,200 కోట్లు అవుతుంది. అయితే పెన్షన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుండి 57 ఏళ్ల కు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. 57 ఏళ్లు నిండిన వారి సంఖ్యను గుర్తించి ఈ ఏప్రిల్ నుండి పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. ఓటర్ జాబితా ఆధారంగా 57 ఏళ్లు నిండిన వారి సంఖ్యను లెక్కిస్తున్నారు. అధికారుల ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 10 నుండి 13 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.దీంతో ఆసరా పెన్షన్ లలో 57 ఏళ్లు నిండిన వారిని కూడా కలిపి నిధులు కేటాయిస్తున్నారు. అన్నీ కలిపితే ఆసరా పెన్షన్ లకు ఏడాదికి 15 వేల కోట్లు కేటాయించాల్సి ఉంది.
ఆర్థిక శాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం రైతుబంధు పథకానికి 15 వేల కోట్లు అవసరమని తేలింది. లక్ష లోపు రుణాల మాఫీకి 24 వేల కోట్లు అవసరమని గుర్తించారు.అయితే రుణమాఫీ కి అవసరమైన నిధులను గతంలో లాగా నాలుగు దఫాలుగా చెల్లించేలా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళిక చేస్తున్నారని తెలిసింది.. నిరుద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ప్రభుత్వం వద్ద లేదు. అయితే బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే.. నిరుద్యోగుల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకే.. ఈ పథకానికి కొంత మొత్తం కేటాయించాలి. ఇవి కాక… సాగునీటి పారుదల రంగానికి రూ. పాతిక వేల కోట్లు కేటాయించారు. ఉద్యోగుల జీతభత్యాలు ఇతర కేటాయింపులను కూడా పెంచాలి. వీటన్నింటినీ సమన్వయం చేసుకోవడం ఆర్థిక శాఖ అధికారులకు కత్తి మీద సాములానే మారింది.