తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సారి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను దళిత బంధు కోసం ప్రత్యేకించేలా ఉన్నారు. దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లోనే ఆ చట్టం తీసుకు వచ్చి ఆమోదింప చేస్తారు. అయితే కేసీఆర్ దళిత బంధుకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రకారం చూస్తే ఏదో ఆషామాషీగా ఆమోదించే అవకాశం లేదు. వీలైనంతగా మైలేజీ కోసం ప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాంటి ప్రయత్నాలు ఏమిటో అసెంబ్లీలో చూడటానికే ఎక్కువ చాన్స్ ఉంది.
కాంగ్రెస్ పార్టీ తరపున దళిత బంధు లోపాల గురించి కానీ ఇతర అంశాలపై గట్టిగా స్పందించే ఎమ్మెల్యే లేరు. సీఎల్పీ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క దళిత బంధుకు పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఇక ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు క్రెడిట్ పూర్తి టీఆర్ఎస్ ఖాతాలో పడటానికి అవసరమైన సన్నాహాలు చేసుకుని ఉంటారు. గతంలో పథకాలకు చట్టబద్ధత కల్పించిన సందర్భాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బంగారు తల్లి అనే పథకాన్ని తీసుకొచ్చారు. దానికి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించారు.
అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పథకం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే చట్టబద్ధత అనేది తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి తప్ప నిర్బంధ అమలుకు కాదని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే కేసీఆర్ ఇప్పుడు దళిత బంధును ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తామని చెబుతున్నారు కాబట్టి ఆ నమ్మకం ప్రజల్లో కల్పించేందుకు చట్టబద్ధత అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అనుకోవచ్చు.