తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలను ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నారని.. అందుకే కేరళ పర్యటనకు వెళ్లారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి.. ఆ ప్రయత్నం జరగాలంటే… ముందుగా.. కేసీఆర్ కలవాల్సింది.. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలను. సీతారాం ఏచూరీ, ప్రకాష్ కారత్, సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్లను… కలసి.. కూటమి చర్చలు జరపాలి. ఎందుకంటే.. వారి పార్టీల్లో వారే అత్యున్నత హోదాల్లో ఉన్నారు. నిర్ణయాలు ఏమైనా… వారి దగ్గర్నుంచే వస్తాయి. కానీ.. ఆ పార్టీలు అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కేరళలో… సీఎంగా ఉన్న పినరయి విజయన్ను కలవడం వల్ల ఫ్రంట్ చర్చలు సాధ్యం కాదు. అసలు పినరయి విజయన్.. కేరళ బయట.. తన పార్టీ విధానాన్ని చర్చించడానికి కూడా.. ఏ మాత్రం అంగీకరించరు. తనకు జాతీయ స్థాయిలో పార్టీ ఏ బాధ్యతలు ఇవ్వలేదు కాబట్టి… వాటి గురించి తాను చర్చించలేనని నిర్మోహమాటంగానే చెప్పి ఉంటారు.
మరి కేసీఆర్… పినరయి విజయన్‌తో ఎందుకు చర్చలకు వెళ్లినట్లు..? . కేసీఆర్ ఆధ్యాత్మిక యాత్రను మాత్రమే ప్లాన్ చేసుకున్నారని… ఓ ముఖ్యమంత్రిగా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు.. గౌరవ ప్రదంగా.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావడం.. సంప్రదాయమని… అందుకే పినరయి విజయన్‌తో సమావేశం అయ్యారని అంటున్నారు. అయితే ఇందులో… జాతీయ రాజకీయాలు, బీజేపీ, కాంగ్రెస్‌ల తీరుపైనా ప్రధాన చర్చ జరిగిందని అంటున్నారు. కేరళలో బీజేపీ పాత్ర నామమాత్రం.. కానీ శబరిమల ఇష్యూతో… హిందువుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకున్నారు. ఆ కారణంగా అక్కడ బీజేపీ ఓటుబ్యాంక్‌ను పెంచుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో బీజేపీని మరింత కట్టడి చేయడానికి పినరయి విజయన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
నిజానికి.. తెలంగాణ కేసీఆర్‌కు ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో… కేరళలో పినరయి విజయన్‌కు అలాంటి రాజకీయ పరిస్థితులే ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి. కేరళలో కూడా.. కమ్యూనిస్టులకు కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి. ఈ కారణంగానే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి.. ఆ పార్టీల నేతలు ముందుకు వెళ్లలేకపోయారు. అయితే.. అటు తెలంగాణలో.. అయినా.. ఇటు కేరళలో అయినా బీజేపీ… బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీని ఎలా నిలువరించాలనేదానితో పాటు.. కాంగ్రెస్ ను ఎలా ఎదుర్కోవాలన్నదానిపైనా.. ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని చెబుతున్నారు.