కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించుకుంటుంది అనే సెటైర్ ఆ పార్టీపై ఉంటుంది. ఎంతకు దిగజారిపోయినా ఆ సెటైర్ ఎప్పటికప్పుడు నిజం అవుతూనే ఉంది. ముందు ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత పదవులు వస్తాయి. అప్పుడు పదవుల కోసం కొట్లాడుకోవచ్చు. అసలు ఇంకా ఎన్నికల్లో గెలవకుండానే.. గెలుస్తారన్న పెద్దగా ఆశలు లేకుండానే పదవుల కోసం కొట్లాడటం కాంగ్రెస్ నేతలకే చెల్లింది. నేనే సీఎం అవుతా అని రేవంత్ రెడ్డి పరోక్షంగా చెబుతూంటే.. నాకేం తక్కువ భట్టి విక్రమార్క ప్రశ్నిస్తున్నారు. వారిద్దరేనా ఇంకా బయటపడని చాలా మంది సీనియర్లు.. తాము మాత్రం తీసిపోయామా అని అనుకుంటూ ఉంటారు.
కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ ఎక్కడ సీఎం అవుతారో అని భట్టి విక్రమార్కను కొంత మంది ప్రోత్సహిస్తున్నారు. ఆయన మీడియాతో సీఎం కావడానికి నాకేం తక్కువ అని కామెంట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం పదవిగురించి ఆయన ఎక్కడా బహిరంగంగా చెప్పడం లేదు. మాట్లాడటం లేదు. మీడియా చిట్ చాట్లలో తన మనసులో మాట పరోక్షంగా చెబుతున్నారు. ప్రస్తుతానికి తన దృష్టి అంతా కాంగ్రెస్ ను గెలిపించడంపైనే ఉందని చెబుతున్నారు. ఇతర నేతలూ తాము సీఎం స్థాయి నేతలమనుకుంటున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. అక్కడి నేతలు సీఎం పదవి కోసం పోటీ పడటం సహజమే. కానీ తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఏ ఒక్క సర్వే చెప్పడం లేదు. ఇలాంటి సమయంలో కష్టపడి పార్టీని బలోపేతం చేసి.. గెలిపించాలని ఎవరైనా ఆలోచిస్తారు. ఎందుకంటే గెలిస్తేనే పదవుల రేస్ ఉంటుంది. ఓడిపోతే రాజకీయ భవిష్యత్ క్లోజ్ అవుతుంది. కానీ ఈ విషయాలను కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదు. తాము సీఎం అయితేనే కాంగ్రెస్ గెలవాలన్నట్లుగా వారి తీరు ఉంది. వీరు తీరు చూసి కాంగ్రెస్ కు ఓటేయాలనుకునేవారు కూడా.. సర్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.