తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు రాత్రికి రాత్రే షెడ్యూల్ ప్రకటించడంపై కొత్త వివాదం ప్రారంభమయింది. పాత వారికి ఓటుహక్కు కల్పిస్తూ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు వారాలు ఎన్నికలు వాయిదా వేసి కొత్తగా ఎన్నికైన ఎంపిటీసీలకు, జెడ్పిటీసీలకు పోలింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ నెల 27 ఫలితాలు కూడా రాబోతున్నాయి. కాని పాత ఎంపీటీసీ , జెడ్పీటీసీ లకు మాత్రమే ఓటింగ్ కల్పిస్తూ.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది చట్ట విరుద్ధమని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.
కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ , జెడ్పీటీసీ లకు ఓటింగ్ అవకాశం ఇవ్వలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పైన నిర్ణయం తీసుకోవాలని రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.
ఫిరాయించిన స్థానిక సంస్థల ప్రతినిధులు తమ వద్దే ఉన్నందున వారితో ఓట్లు వేయించుకుని గెలవాలని టిఆర్ఎస్ భావిస్తోందని వారంటున్నారు. కొత్త వారిని మళ్ళీ సమీకరించుకోవడానికి ఇబ్బంది అవుతుందన్న భావనతో అధికార పార్టీ ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై కుట్రలకు తెరలేపుతున్నారని అంటున్నారు. ఎన్నికల సంఘం అధికారులతో అవగాహన లేకపోతే టిఆర్ఎస్ వెంటనే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తుందని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు రాత్రి షెడ్యూల్ ఇచ్చి ఉదయం నోటిఫికేషన్ ఇచ్చారని…ఈ ఎన్నికలపై కోర్టును ఆశ్రయిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. నోటిఫికేషన్ గురించి ముందే తెలిసినట్లు.. టీఆర్ఎస్ వెంటనే అభ్యర్థుల్ని ప్రకటించింది , ఈసీ వ్యవహారశైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఓటర్ల జాబితాను ఇంకా వెబ్సైట్లో పెట్టలేదని మండిపడ్డారు. సీఈవోకి ఓటర్లు ఎవరో తెలియకుండా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పోలింగ్ రెండువారాలు వాయిదా వేసి.. కొత్త ఎంసీటీసీలు, జెడ్పీటీసీలకు ఓటు హక్కు కల్పించాలంటున్నారు.