తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక సమస్యకు పరిష్కారం చేసి..మరో సమస్యను నెత్తి మీద పెట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. యాసంగి వడ్లను ప్రతి గింజను కొంటామని ప్రకటించారు. సీఎం ప్రకటన చాలా మంది రైతుల్ని ఆశ్చర్య పరిచింది. కేసీఆర్ను గుడ్డిగా నమ్మిన అనేక మంది రైతుల్ని నిశ్చేష్టుల్ని చేసింది. కేసీఆర్ మాటలు నమ్మి తాము నట్టేట మునిగిపోయామని వారు బాధపడే పరిస్థితి వచ్చింది. గత ఏడాది కేసీఆర్ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు.. వచ్చే ఏడాది నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని… ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంట వేయవద్దన్నారు. చివరికి వారికి వరి విత్తనాలు దొరకుండా కలెక్టర్ల స్థాయిలో ప్రయత్నాలు కూడా చేశారు.
ఎంతైనా ప్రభుత్వం చెబుతోంది కదా అని .. వేల మంది రైతులు వరి పంటను పెట్టలేదు. చాలా మంది ప్రత్యామ్నాయ పంటలు కూడా వేయలేకపోయారు. ఫలితంగా నీటి సౌకర్యం ఉన్నా వేల ఎకరాలు బీళ్లుగా ఉండిపోయాయి. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించలేకపోవడం కూడా దీనికి కారణం. వారంతాపంటలు వేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ప్రభుత్వం మాట వినకుండా వరి పంట వేసిన వారికి ప్రభుత్వం అండగా ఉంటోంది.. కానీ ప్రభుత్వం మాట విని ఏ పంటా వేయని వారి పరిస్థితి ఇప్పుడు దుర్భరంగా మారింది.
కేసీఆర్ ఇప్పుడు వరి పండించిన రైతులను కాదు.. కేసీఆర్ మాటలు విని వరి పంటకు దూరంగా ఉన్న రైతులనూ ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాసంగి పంటలో వడ్లు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ నష్టం భరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం తీసుకున్నన్ని బియ్యం ఇచ్చి మిగతా వాటిని ఇక్కడే సర్దుబాటు చేసుకోనున్నారు. మరి పంట వేయని రైతులను కేసీఆర్ ఎలా ఆదుకుంటారో చూడాల్సి ఉంది. ఒక వేళ అలాంటి ఆలోచనలు చేయకపోతే.. కేసీఆర్కు విధేయ రైతుల నుంచి సెగ తగలకతప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది.