హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిభగల క్రీడాకారులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని భారీస్థాయిలో పెంచింది. అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించే రాష్ట్ర క్రీడాకారులకు గతంలో ఎన్నడూ లేనంతగా కనీవినీ ఎరగని స్థాయిలో భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటిన రాష్ట్ర క్రీడాకారులకు, వాళ్ళను ఆ స్థాయికి తీర్చిదిద్దిన కోచ్లకూ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయిస్తూ నిన్న అధికారికంగా జీవో జారీ చేసింది. అలాగే గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఖో ఖో, కబడ్డీ లాంటి ఒలింపికేతర క్రీడాంశాల్లో రాణించే ఆటగాళ్ళకూ ఇకనుంచి ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది. గతంలో ఒలింపిక్స్లో స్వర్ణపతకం గెలిస్తే రు.25 లక్షలుగా ఉన్న ప్రోత్సాహకాన్ని ఈ సారి ఏకంగా రు.2 కోట్లకు పెంచారు. రజతానికి రు.16 లక్షలనుంచి కోటి రూపాయలకు, కాంస్యానికి రు.10 లక్షలనుంచి అరకోటి రూపాయలకు పెంచేశారు.