ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి.. చాలా కొత్త హామీలు ఇచ్చింది. రూ. లక్ష ఏక మొత్తం రుణమాఫీ, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి సహా అనేక కీలక పథకాలు ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సహజంగా ఏ ప్రభుత్వం అయినా… ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాల అమలుపై ఇప్పటి వరకూ ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన మూడు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘఢ్‌లలో… రూ. 2 లక్ష రుణమాఫీని అమలు చేశారు. కానీ.. తెలంగాణలో టీఆర్ఎస్ ఇచ్చిన రూ. లక్ష రుణమాపీపై ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. గవర్నర్ ప్రసంగంలో పెట్టలేదు. గవర్నర్ ప్రసంగంపై… ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చిన కేసీఆర్.. సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని తేల్చి చెప్పారు. ఐదేళ్లలో అమలు చేయాల్సిన హామీల గురించి ఇప్పుడే రచ్చ చేయడం కరెక్ట్ కాదంటున్నారు కేసీఆర్.
రుణాలపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత ఎన్నివిడతల్లో మాఫీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిజానికి ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామనేది టీఆర్ఎస్ హామీ. కానీ.. ఇప్పుడు అసెంబ్లీలోనే ఎన్ని విడతలుగా చేయాలో అధ్యయనం చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. ఇక కొన్ని పనులకు ఎన్నికల కోడ్ అవరోధంగా ఉన్నట్లుగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తి కాగానే పనులు, సంస్కరణల్లో వేగం పెరుగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి వాటిపై అసలు ఎలాంటి ప్రస్తావన తేలేదు. మరో వైపు పొరుగు రాష్ట్రం ఏపీలో… పెన్షన్లు జనవరి నుంచి రెండింతలు చేశారు. అలాగే.. మహిళా సంఘాలకు స్మార్టు ఫోన్లతో పాటు.. తలా ఓ రూ. పదివేలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మద్య పోలికులు కామన్ అయిపోయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
కొసమెరుపేమిటంటే.. వైఎస్‌ను విమర్శించడానికి ఎలాంటి సందర్భం అయినా సృష్టించుకునే కేసీఆర్.. ఈ సారి.. పొగడానికి ఆరోగ్యశ్రీని ఎంచుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకమని చెప్పారు. అందుకే ఎలాంటి మార్పులు లేకుండా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్‌లో వైసీపీ చేరేందుకు సిద్ధమయిన తరుణంలో.. వైఎస్ గురించి గొప్పగా మాట్లాడారు.