ఏపీ ప్రభుత్వం ధరలు తగ్గించిన ప్రభావమో లేకపోతే నిజంగానే ధరలు పెంచారని మందు బాబులు తాగడం మానేశారేమో కానీ తెలంగాణలో మద్యం డిమాండ్ అనుకున్నంతగా లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రేట్లు తగ్గించాలని నిర్ణయించుకుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత మద్యం రేట్లను ఇరవై శాతం వరకూ పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత మద్యంకు కాస్త డిమాండ్ కూడా తగ్గింది. దీంతో మద్యం, సప్లై పెంచే దిశగా ఆప్కారి శాఖ అడుగులు వేస్తోంది.
లిక్కర్ అమ్మాకాలు పెంచడానికి ఒక్కో బాటిల్‌పై 10 రూపాయలు తగ్గించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు లీక్ చేశాయి. రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో బీర్ల అమ్మకాలు తగ్గడంతో.. ఒక్కో బాటిల్‌పై 10 రూపాయలు తగ్గించింది ప్రభుత్వం. కానీ, లిక్కర్ బాటిల్‌పై ధర మాత్రం తగ్గించలేదు. అందువలన బీర్లు మినహా ఇండియాలో తయారయ్యే మద్యం పై స్వల్పంగా ధరలు తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
లిక్కర్ సేల్స్ కాస్త పడిపోవడానికి ఏపీలో ధరలు తగ్గించడం కూడా ఓ కారణం కావొచ్చని భావిస్తున్నారు. గతంలో అక్కడికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున లిక్కర్ స్మగ్లింగ్ అయ్యేది . ఇప్పుడు అది తగ్గింది. సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా కొనుగోళ్లు తగ్గాయని తెలుస్తోంది. దీంతో కాస్త ధరలు తగ్గిస్తే మళ్లీ పాత డిమాండ్ వస్తుందని తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.