తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగులలో ఒక భాగాన్ని పర్మనెంటు చేయడం, అంగన్వాడీలు ఆశాలు తదితర ఉద్యోగుల జీతాలు పెంచడం వంటి పనుల చేసింది. ఇది మంచి విషయమే. అయితే ఇవన్నీ సర్కారాధీశుడైన ముఖ్యమంత్రి ఔదార్యంతో జరగాలే తప్ప సంఘాల ద్వారా వస్తే కుదరదన్న వైఖరి ప్రభుత్వం తీసుకుంటున్నది. సమ్మెలు పోరాటాలు అంటే వచ్చేది కూడా రాదు, ప్రభుత్వానికి అంటే టిఆర్ఎస్కు అనుకూలంగా వుంటేనే కోర్కెలు నెరవేరతాయనే అభిప్రాయం కలిగించడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నది. ఏదైనా అడుక్కుంటే ఇస్తాం గాని సమ్మెలు పోరాటాలు చేస్తే కుదరని కెసిఆర్ చేసిన ప్రకటన అహంభావమని సిఐటియు నాయకులు తీవ్రంగా విమర్శించారు. అంగన్వాడీలను కూడగట్టి ఒక శక్తిగా మలచిన సంఘాల నాయకులకు అవకాశం లేకుండానే ముఖ్యమంత్రి భవనంలో చర్చలకు పిలిస్తే వారిలో కొందరు అతికష్టం మీద వెళ్లగలిగారు. ఇక ఈ విషయంలో మంత్రి హరీశ్ రావు కూడా సిఐటియును లక్ష్యంగా చేసుకుని తరచూ మాట్లాడుతుంటారు. ఆర్టీసి, జలమండలి వంటి సంస్థల్లో ఆయన టిఆర్ఎస్ అనుకూల కార్మిక సంఘాల గౌరవాద్యక్షుడుగా వుంటారు. అయితే తన స్వంత నియోజకవర్గంలోనే కార్మిక సంఘల ఎన్నికల్లో ఆయన చాలాసార్లు సిఐటియు చేతిలో ఓడిపోతుంటారనేది ఆశ్చర్యకరమైన వాస్తవం. హౌంమంత్రిగా వున్న మాజీ కార్మిక నేత నాయని నరసింహారెడ్డికి ఇష్టం లేకున్నా హరీశ్ కార్మికసంఘాలపై పట్టు వదులుకోరని ఆయన అనుయాయులు చెబుతుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం పారిశ్రామిక వివాదాల చట్టాన్ని అమలు చేయడం లేదు. వనపర్తి గద్వాల భూపాలపల్లి జిల్లాల వంటిచోట్ల 30వసెక్షన్ విధించి ధర్నాలు నిరసనలు అడ్డుకుంటున్నది. హైదరాబాదులో ఇందిరాపార్కు దగ్గర నిరంతరం ఉద్యోగ కార్మికులు బైఠాయింపు జరిపే ధర్నాచౌక్కే ఎసరు పెట్టింది. ప్రజాస్వామ్యంలో తమ కోర్కెలు వినిపించేందుకు ఆందోళనలు చేసేందుకు సంఘాలుగా ఏర్పడేందుకు వున్న హక్కును ఎవరైనా గౌరవించాల్సిందే. ఏవైనా జీతాల పెంపుదల వంటివిప్రకటించిన ప్రతిసారి కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేయడం, పూజలు జరపడం మరో విడ్డూరపు అలవాటుగా మారింది. ఇవన్న ప్రభుత్వ వ్యవస్థను ప్రహసనంగా మారుస్తున్నాయి.