తెలంగాణ గవర్నర్ ను గుర్తించడానికి కూడా ఇష్టపడని తెలంగాణ సీఎం కేసీఆర్ కు .. కొన్ని పరిస్థితుల్లో ఆమె సంతకాలు రాజ్యాంగ పరంగా తప్పని సరి అవుతున్నాయి. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లలకు తమిళిసై ఇప్పటికీ ఆమోదం తెలియచేయలేదు. అలాగే తిరస్కరించలేదు. దీంతో ఏం చేయాలో ఇప్పటికీ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఇప్పుడు అలా పెండింగ్‌లో పెట్టుకోలేని ఫైల్ ఒకటి రాజ్ భవన్‌కు తెలంగాణ ప్రభుత్వం పంపింది. అదే బడ్జెట్.
ఈ నెల 21న గవర్నర్ కు ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఫైల్‌ను పంపారు. కానీ గవర్నర్ ఆమోదించలేదు. వరుసగా రెండో సారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్‌కు ఎట్లా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్‌ను ఎందుకు నిర్వహించడం లేదని ఆమె ప్రశ్నించారు.
సమావేశాలకు టైమ్దగ్గరపడుతుండటం, బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేసి బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపేలా ఆదేశించాలని కోరనుంది. ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
గత ఏడాది కూడా ఇదే తరహాలో గవర్నర్ స్పీచ్ లేకుండానే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు పెడితే గవర్నర్ అప్పుడు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తన స్పీచ్ లేకుండా చేయడంతో గవర్నర్ బాహాటంగానే తప్పుపడుతున్నారు. ఇప్పుడు వివాదం కోర్టుకు చేరుతుంది. కోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తుందో కానీ.. తెలంగాణ సర్కార్ మాత్రం తమ చేతల వల్ల తానే ఇబ్బంది పడుతోందన్న అభిప్రాయానికి అధికారవర్గాలు వస్తున్నాయి.