రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ కు కొత్త చిక్కులు ఎదురు అవుతున్నట్లుగా తెలుస్తోంది. రుణమాఫీ కోసం అవసరమైన 30వేల కోట్లను ఒకేసారి రాబట్టుకోవడం ప్రభుత్వానికి అంత సులభతరం కాదని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇలాంటి చిక్కుముడులు వస్తాయని అంచనా వేసిన ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాని ద్వారా ఒకేసారి రైతులకు రుణమాఫీ చేసి ఆ కార్పొరేషన్ కు విడతల వారీగా చెల్లించాలనుకుంది. కానీ, ఆ కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో చిక్కుముడులు తలెత్తుతున్నాయి. ఆర్బీఐ నుంచి ఋణం తీసుకోవాలంటే ఆదాయ మార్గాలను చూపించాల్సి ఉంటుంది. దీంతో ఆదాయాన్ని సృష్టించే కార్పొరేషన్ ఏర్పాటు ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్ గా మారింది.
ల్యాండ్ బ్యాంక్ ను ప్రాపర్టీగా చూపించి కార్పొరేషన్ ఏర్పాటుతో ఆర్బీఐ నుంచి ఋణం పొందాలని ప్రభుత్వం భావించింది. కానీ, ల్యాండ్ బ్యాంక్ ను క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ గా భావించలేమని ఆర్బీఐ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సర్కార్ ఇప్పుడు ఏం చేయనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ అంశం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. జూన్ 4 తర్వాత రేవంత్ ఈ అంశంపై అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.