వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల రైతు ఆవేదనా యాత్ర పేరుతో ప్రతీ రోజూ ఓ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అచ్చంగా ఓదార్పు యాత్ర తరహాలో చేస్తున్నారు. బాధిత కుటుంబానికి కొంతసాయం చేసి ఓ ఫోన్ నెంబర్ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సాయం అయినా చేస్తామని చెబుతున్నారు. అంతా గతంలో జగన్ చేసిన ఓదార్పు యాత్ర స్టైల్లోనే ఉంది. కానీ అప్పుడూ ఇప్పుడు ఒకటే తేడా కనిపిస్తోంది.. అదే మీడియా కవరేజ్. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తే విస్తృతంగా మీడియాలో కవరేజీ వచ్చింది. కానీ షర్మిలను ఏ మీడియా పట్టించుకోవడం లేదు. చివరికి సోషల్ మీడియాలో కూడా హైలెట్ చేసుకోలేకపోతున్నారు.
షర్మిల రైతు ఆవేదనా యాత్రకు వెళ్తున్నారన్న విషయమే చాలా మందికి తెలియడం లేదు. తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందు నుంచీ షర్మిల ను పట్టించుకోవడం లేదు. ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రం కాస్త కవరేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఏమైనా మార్కెటింగ్ ఒప్పందాలు ఉన్నాయా.. లేక మరొకటా అన్నదానిపై స్పష్టత లేదు. ఇతర మీడియాలు అసలు పట్టించుకోవడం లేదు. దీంతో షర్మిల ఆవేదన ఎవరికీ చేరడం లేదు. తనకు పబ్లిసిటీ వచ్చేందుకు షర్మిల చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా స్ట్రాటజిస్టులు రాసిస్తున్న అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలనూ చదువుతున్నారు. కానీ అందరూ లైట్ తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ప్రతీ రోజూ షర్మిల అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉరేసుకోవాలంటున్నారు. చావుడప్పు కొడతామంటున్నారు.. ఇంకా చాలా అంటున్నారు. మామూలుగా అయితే ఇలాంటి మాటలు తెలంగాణ రాజకీయ నాయకుడు ఎవరైనా అంటే.. రచ్చ రచ్చ అయిపోతుంది. కానీ షర్మిల అన్నది కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం ఏముందని లైట్ తీసుకుంటున్నారు. ఆమె వివాదం కోసం అలా మాట్లాడుతున్నారని డిసైడ్ అవుతున్నారు. మొత్తంగా చూస్తే షర్మిలను తెలంగాణలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ విషయాన్ని షర్మిల ఇంకా గుర్తించలేకపోతున్నారన్న అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.