తెలంగాణ రాజకీయాలను పూర్తిగా ” మర్డర్ స్కెచ్ ” డామినేట్ చేస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ త్యకు కుట్ర పన్నారంటూ ఎనిమిది మందిని అరెస్ట్ చేయడంతో విలేకరుల సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణలపేర్లు చెప్పడంతో కలకలం ప్రారంభమయింది. దీనిపై బీజేపీ నేతలు కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.
బీజేపీపై కుట్ర పన్నారని ఈ విషయాన్ని ఇంతటితో వదలబోమని కేంద్ర దర్యాప్తు సంస్థల వద్దకు తీసుకెళ్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. బండి సంజయ్ ఈ అంశాన్ని కేంద్ర నేతల దృష్టికి తీసుకెళ్లారు. జేపీ నడ్డా కూడా బండి సంజయ్‌తో పాటు జితేందర్ రెడ్డితో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. జితేందర్ రెడ్డి, డీకే అరుణ మీడియా సమావేశం పెట్టి తెలంగాణ పోలీసులతో కాదని సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తమ ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని ఇదేం సంస్కృతని ప్రశ్నిస్తున్నారు. సీబీఐ విచారణపై నమ్మకం లేకపోతే జ్యూడిషియల్ విచారణకు రెడీ కావాలన్నారు. టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు హత్యలకు కూడా దిగజారిపోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంశంలో సాక్షాత్తు మంత్రినే చంపడానికి కుట్ర జరిగింది కావున ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ జాతీయ నాయకులతో సహా, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్రలను బహిరంగంగా లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
పదిహేను కోట్ల సుపారీ ఇస్తామన్న నిందితులకు లక్షల్లో కూడా ఆస్తులు లేవని.. వారెలా హత్యకు కుట్రపన్నుతారని టీ పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరగాలని.. తెలంగాణను మరో బీహార్ మారే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు ఈ కేసులో పోలీసులు రాఘవేందర్ రాజు అనే నిందితుడి రిమాండ్ రిపోర్ట్‌ను లీక్ చేశారు. అందులో తనపై ఉన్నకేసులన్నీ శ్రీనివాస్ గౌడ్ పెట్టించారని అందుకే హత్య చేయించాలనుకున్నానని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లుగాఉంది.