తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయానికి ఓ రూపం వస్తోంది. ఫోటోలు కూడా బయటకు రాకుండా ఇంతకాలం నిర్మాణం సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసినప్పుడే కొన్ని ఫోటోలు బయటకు వస్తున్నాయి. గురువారం కేసీఆర్ అక్కడ పర్యటించారు. శరవేగంగా నిర్మాణం అవుతోంది. ఇప్పటికే ఓ రూపం వచ్చింది. రాత్రింబవళ్లు పనులు సాగుతున్నాయి. ఓ వైపు పైన కాంక్రీట్ పనులు జరుగుతూండగా.. కింద ఇంటీరియర్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు.
రెండు అంతస్తుల్లో మంత్రుల చాంబర్లు ఉంటాయి. వాటిలో ఫాల్స్ సీలింగ్ పనులు సైతం చేసేస్తున్నారు. సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణంపై ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాంటి మెటీరియల్ వాడాలో కూడా కాంట్రాక్టర్లకు సూచిస్తున్నారు. ఎర్రకోట నిర్మాణానికి ఉపయోగించిన ఆగ్రా ఎర్రరాతిని గోడలకు వాడాలని ఆదేశించారు. అలాగే లోప ల గోడలకు.. పెయింటింగ్.. కిటీకీలు ఎలాంటివి వాడాలి అన్న వాటిని ఖరారు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని పాలనకు గర్తుగా ఉండటం కన్నా.. సొంత గుర్తింపు ఉండేలా సచివాలయాన్ని నిర్మించాలని ప్రయత్నించారు.
సికింద్రాబాద్, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో స్థల పరిశీలన చేసినప్పటికీ అడ్డంకుల వల్ల ముందుకు సాగలేదు. చివరికి ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో వచ్చిన వైసీపీ సర్కార్ భవనాలన్నీ ఇచ్చేయడంతో వెంటనే కూల్చేసి.. స్థలాన్ని సువిశాలంగా మార్చి నిర్మాణం ప్రారంభించేశారు. ఎన్నికల కంటే ముందే అందులో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.