తెలంగాణలో గొల్లలు కురుమలకు తలకు 20 గొర్రెలు,ఒక పోతు ఇచ్చే పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించడం హర్షనీయం. ఒకే రోజు వంద చోట్ల ఈ పంపిణీ చేశామన్నారు. మంచిదే. వ్యవసాయం అనుబంధ వృత్తులు చితికిపోయిన పరిస్తితుల్లో ఒక తరగతి నిలదొక్కుకోవడానికి ఇది సహకరిస్తే అంతకన్నా కావలసింది లేదు. తెలంగాణలో మాంసాహార అవసరాలు, దిగుమతులు వంటివి లెక్కలు కట్టి మరీ ఈ విధానం రూపొందించినట్టు కెసిఆర్ గతంలోనే శాసనసభలో చెప్పారు. అయితే ఇలాటి పంపిణీలు ఇదే కొత్త కాదు. ఇందిరాగాంధీ హయాంలో గొర్రెలు బర్రెలు ఇచ్చి మాయచేశారని పెద్ద నానుడిగా వుండేది. అదంతా గతం గనక వదిలేయొచ్చు. కాని ఇప్పటి మాటలలో వాస్తవమెంత అతిశయమెంత? ఈ గొర్రెలు వాటి సంతతి అభివృద్ధి చెందితే మూడేళ్ల తర్వాత తెలంగాణ గొల్లకురుమలకు పాతికవేల కోట్ల సంపద వస్తుందని కెసిఆర్ అదేపనిగా చెప్పడం అరచేతిలో వైకుంఠం చూపడమే. ఎందుకంటే మూడేళ్ల తర్వాత పరిస్థితులు ఎవరూ చెప్పలేరు.
రెండవది వీటి పెంపకం పోషణ, మార్కెట్ తదితర సమస్యలు అనేకం వుండటం సహజం. దేశంలో పాడి పరిశ్రమ నెమ్మదిగా బహుళజాతి కంపెనీల చేతుల్లోకి పోతున్నది. మోడీ ప్రభుత్వం పశు వ్యాపారంపై విధించిన ఆంక్షలు కూడా అంతిమంగా వారికే మేలు చేస్తాయని విమర్శ వుంది. వాటివల్ల బాగా నష్టపోయే రాష్ట్రాల్లో ఎపి తెలంగాణ వుంటాయి. . లోగడ ప్రభుత్వాలు కూడా మహిళలను లక్షాధికారులను చేస్తామని కోటీశ్వరులను చేస్తామని వూదరగొట్టడం కొత్తేమీ కాదు! కనక మార్కెటింగ్, గిట్టుబాటు వంటివాటిపై దృష్టిపెట్టకుండా పాతికవేల కోట్టు వచ్చి పడినట్టే ప్రచారం హౌరెత్తించడం అతిశయోక్తి మాత్రమే