తెలంగాణలో ఆర్థిక విధాన సంబంధమైన అంశాలన్నీ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా సమీక్షిస్తుండటంతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాత్ర నామమాత్రమై పోయిందన్న అభిప్రాయం బలంగా వుంది. వాస్తవానికి ఒక సమీక్ష సందర్భంలో ఆయన వచ్చినా వెనక్కు వెళ్లిపోవలసి వచ్చిందని కూడా ప్రభుత్వ సమాచార విభాగంలో పనిచేస్తున్న వారే చెప్పారు. పైగా ఇది రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ వినిపిస్తున్న మాటే. కెటిఆర్ నాయకత్వం కోసం హరీశ్ రావు ల గురించి నిరంతరం మాటలు వినిపిస్తుంటాయి గాని వాస్తవంలో ఈటెలపై కూడా ప్రత్యేక దృష్టి వుందనేది ఈ వర్గాల అంచనా. అదలా వుంచితే ఇప్పుడు జిఎస్టి ప్రభావంపై కెసిఆర్ వ్యాఖ్యలు గతంలో ఈటెల చెప్పిన దానికి పూర్తి భిన్నంగా వుండటం విశేషం. జిఎస్టి వల్ల నాలుగు వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. కొన్ని సుంకాల రద్దుకోసం తాము ప్రయత్నించినా స్పందన రాలేదనీ అసలు తమ మాటలు వినిపించుకోనేలేదని ఈటెల చెప్పారు. మిషన్ భగీరథకు సంబంధించి అలాగే ప్రాజెక్టులకు సంబంధించి సిమెంటు భారం,సర్వీసు పన్ను భారం తగ్గించాలన్నది ఒక ప్రధాన కోర్కె. అయితే ఒక్క చోటనే తగ్గించడం కుదరదని కేంద్రం చెప్పిందట. పైగా తెలంగాణలో వృద్ధి రేటు 17 శాతం పైగా వుంది గనక పరిహారం రాదు.14 శాతం లోపు రేటు వున్న వారికే లభిస్తుంది. ఎంపి కవిత కూడా జిఎస్టి చారిత్రాత్మకమని పొగిడినా అంతలోనే సర్దుకుని సమస్యలు కూడా చెప్పారు. అయితే ఇవన్నీ అయ్యాక కెసిఆర్ మాత్రం జిఎస్టి వల్ల నష్టం లేకపోగా 3000 కోట్ల అదనపు ఆదాయం రావచ్చన్నట్టు చెప్పారు. యాభై శాతం ఆదాయంలో మార్పు వుండదు, కేంద్రానికి వెళ్లే యాభై శాతంలోనూ వాటా వుంటుంది అని కూడా వివరించారు. దీనిపై అవగాహనా సదస్సులు పెట్టాలని ఆదేశించారు. ఇదంతా చూస్తే గతంలో నోట్లరద్దుపై ఆయన అత్యుత్సాహ సమర్థన గుర్తుకు వచ్చిందని టిఆర్ఎస్ నేతలే కొందరు వ్యాఖ్యానించారు. ఇక ఈటెల ఏం చెబుతారో..