పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ను కేసీఆర్ నేడు ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇచ్చిన గులాబి బాస్ ..ఈ సారి ఎంపీల విషయంలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దించబోతున్నారు. సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని కుమారుడికే చాన్సిస్తున్నారు. యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. చేవేళ్ల నియోజకవర్గం పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కార్తిక్ రెడ్డి లేదా వ్యాపార వేత్త రంజిత్ రెడ్డి కి టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. పార్టీ మారిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించాలని కేసీఆర్ టార్గెట్గా పెట్టుకున్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి పోటీలో ఉండటంతో బలమైన నేతను రంగంలో దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి లోకల్ గా సుపరిచితుడు కావటం … ఆర్థికంగా బలవంతుడు కావడంతో రాజశేఖర్ రెడ్డికే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఖమ్మం నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావు ను బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంపై తుమ్మలకు కూడా.. కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదు. వరంగల్ స్థానానికి సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్ కు ఈసారి కూడా అవకాశం ఇవ్వబోతున్నారు. కడియం శ్రీహరికి ఇస్తారని చర్చ జరిగినా…స్థానికంగా ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. మహబూబాబాద్ నియోజకవర్గంనుంచి సిట్టింగ్ ఎంపి సీతారాంనాయక్ కు కాకుండా మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత కు ఇవ్వబోతున్నారు.
పెద్దపల్లి నియోజకవర్గానికి మాజి ఎంపి వివేక్ ను కేసీఆర్ ఫైనల్ చేశారు. ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ఆయనకే టిక్కెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్ భువనగిరి, ఆదిలాబాద్, మెదక్, జహీరాబాద్, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపి జితెందర్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు లేనట్లే. ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ యజమానికి మన్నే సత్యనారాయణ రెడ్డి సోదరుడు మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఈ స్థానం నుంచి ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి డీ కే అరుణ బీజేపిలో చేరడంతో కొత్త సమీకరణాలు పరిశీలిస్తున్న చెబుతున్నారు.